భవిష్యత్తులో అంతరిక్ష జీవనం మనకు ఎంతవరకు సానుకూలంగా ఉంటుందనే విషయంపై వివిధ దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. రష్యా కూడా అందులో ముందువరుసలో ఉంది. తాజాగా రష్యా అంతరిక్షంలోకి ఎలుకలను పంపుతోంది, ఎలుకలతో పాటు ఈగలను కూడా పంపిస్తోంది. కాస్మిక్ రేడియేషన్ ప్రభావం జీవులపై ఎలా ఉంటుందో తెలిపేందుకే ఈ ప్రయోగం చేపడుతున్నట్టు రష్యా ప్రకటించింది.
నెలరోజుల మిషన్..
నెల రోజుల మిషన్‌లో భాగంగా 75 చిట్టెలుకలను 1,000 ఈగలను అంతరిక్షంలోకి పంపించేందుకు రష్యా సన్నాహాలు చేస్తోంది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ఈ ప్రయోగానికి సిద్ధమైంది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ప్రాబ్లమ్స్ పరిశోధనా సంస్థ ఈ మిషన్లో భాగస్వామిగా ఉంది. ఈ పరిశోధన ఫలితాలు చంద్రుడు, అంగారకుడిపైకి చేపట్టబోయే మానవ సహిత మిషన్లకు సహాయకంగా ఉంటుందని అంటున్నారు.
కాస్మిక్ రేడియేషన్..
అంతరిక్షంలో ఉండే రేడియేషన్ నే కాస్మిక్ రేడియేషన్ అంటారు. ఆ రేడియేషన్ ని తట్టుకోడానికి అంతరిక్ష యాత్రికులు స్పేస్ సూట్స్ ని ధరిస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములపై కూడా కాస్మిక్ రేడియేషన్ ప్రభావం ఉంటుంది. దానికంటే ఎక్కువ ప్రభావం ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం రష్యా ప్రయోగం చేపట్టబోతోంది. ఎలుగలు, ఈగలతోపాటు, కొన్ని విత్తనాలు, ఆల్గే, సూక్ష్మజీవులను కూడా ఆగస్టు 20న కజకిస్తాన్ నుండి ప్రయోగించబోతున్న బయోన్-ఎం2 బయో శాటిలైట్‌లోకి ప్రవేశ పెడతారు. ఈ శాటిలైట్ 30రోజులపాటు భూమిచుట్టూ పరిభ్రమించేలా డిజైన్ చేయబడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు ఎదుర్కొనే రేడియేషన్ కంటే ఎక్కువ రేడియేషన్ ఉన్న ప్రాంతంలో ఈ శాటిలైట్ కక్ష్యలో పరిభ్రమిస్తుందని రోస్కో స్మోస్ తెలిపింది. భూమికి దగ్గరగా ఉన్న కక్ష్య కంటే కాస్మిక్ రేడియేషన్ స్థాయి దాదాపు 30 శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జీవులను అంతరిక్ష దృగ్విషయాలు ఎలా ప్రభావితం చేస్తాయో దీని ద్వారా తెలుస్తుందని అంటున్నారు. ఈ ఫలితాలను అంచనా వేసి సుదూర అంతరిక్ష యాత్రలకు సిద్ధం కావొచ్చని అంటున్నారు.
ఎలుకలను మూడు సమూహాలుగా విభజించారు. కొన్నిటిని భూమిపై సాధారణ స్థితిలో ఉంచుతారు, రెండో సమూహాన్ని భూమిపై ఒక ప్రయోగశాలలో ఉంచి పరీక్షిస్తారు. మూడో సమూహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. కెమెరాలు, సెన్సార్లతోపాటు వాటికి అమర్చిన చిప్ ల సాయంతో ఎలుకలను పర్యవేక్షిస్తారు. వాటి హార్మోన్ల పనితీరు, రోగనిరోధక శక్తి, జీవక్రియలో మార్పులను ట్రాక్ చేస్తారు. అంతరిక్షంలో ఎలుకలను రోస్కోస్మోస్ “మినీయేచర్ హోటల్” లో ఉంచుతారు. ఇందులో సెల్ఫ్ లైటింగ్, వెంటిలేషన్, ఫీడింగ్, వ్యర్థాలను పారవేసే వ్యవస్థలు ఉంటాయి.
అప్పట్లో లైకా..
రష్యాకు జంతువులను అంతరిక్షంలోకి పంపడంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. 1957లోనే లైకా అనే కుక్కను స్పుత్నిక్ 2 ద్వారా అంతరిక్షంలోకి పంపించింది రష్యా. భూమి చుట్టూ కక్ష్యలోకి వచ్చిన మొదటి జీవిగా లైకా గుర్తింపు పొందింది. భూమి వాతావరణం దాటి జీవం యొక్క మనుగడను పరీక్షించడానికి కుక్కలు, కోతులు, ఇతర చిన్న జంతువులను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. తాజాగా ఈగలు, ఎలుకలతో ప్రయోగం మొదలవుతోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత రోస్కో స్మోస్ కి కేటాయించే నిధులు తగ్గిపోయాయి. అదే సమయంలో అంతర్జాతీయ సహకారం కూడా స్తంభించింది. అయినా కూడా జీవ అంతరిక్ష పరిశోధనలో కీలక పాత్ర పోషించాలనే రష్యా ఆశను ఈ ప్రయోగం ప్రతిబింబిస్తుందని అంటున్నారు.