Electricity From Plants : ఇంటి వెనుక గార్డెన్ లో కాస్త స్థలం ఉంటే రకరకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచుకుంటుంటాం. చక్కగా.. పచ్చని పందిరి వేసినట్లుగా ఆకట్టుకోవడంతో పాటు కావాల్సిన అవసరాలు తీర్చుతుంటుంది. మరి.. మీ గార్డెన్ నుంచి తాజా గాలి మాత్రమే కాదు.. మీ ఇంటికి కావాల్సిన విద్యుత్త్ కూడా అందుబాటులోకి వస్తే.. అబ్బో ఊహించుకునేందు భలేగా ఉందిగా అనుకుంటున్నారా.? పర్యావరణానికి ఎంత ప్రయోజనమో అని మురుసిపోతున్నారా.? కానీ.. అలా ఎలా? అసలు సాధ్యమేనా.? ఇవ్వేగా మీ ప్రశ్నలు. కానీ.. అది సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విప్లవాత్మకమైన టెక్నాలజీనే బయో ఎలక్ట్రోజెనెసిస్ అని పిలుస్తున్నారు. ఇది పునరుత్పాదక శక్తిలో విప్లవాత్మక పరిణామంగా మారనుందంటున్నారు పరిశోధకులు. మరింకెందుకు ఆలస్యం.. ఈ విషయం గురించి తెలుసుకుందాం పదండి.
మొక్కలు నుంచి విద్యుత్ ఎలా.?
మొక్కలకు ప్రాణం ఉందన్న సంగతి చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. అలాగే… మొక్కలు, చెట్టు సూర్యరశ్మి నుంచి ఆహారాన్ని తయారు చేసుకుంటాయని, భూమి నుంచి వాటికి కావాల్సిన నీరు, ఇతర పోషకాల్ని తీసుకుని ఎదుగుతాయనీ తెలుసు. ఇదిగో.. ఈ ప్రక్రియలోనే విద్యుత్ ఉత్పత్తికి అవకాశాల్ని వెతికారు.. పరిశోధకులు. అంటే.. మొక్కలు సహజసిద్ధంగా సూర్యకాంతిని రసాయనిక శక్తిగా మార్చే ఫోటోసింథసిస్ ప్రక్రియలో.. మట్టిలోకి కొన్ని జీవ రసాయనాలను విడుదల చేస్తాయి. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ఆ రసాయనాల్ని విచ్ఛిన్నం చేసి ఎలక్ట్రాన్లు విడుదల చేస్తుంటాయి. శాస్త్రవేత్తలు మట్టిలో ఎలక్ట్రోడ్‌లు ఉంచి ఈ ఎలక్ట్రాన్లను స్వీకరిస్తున్నారు. ఎలక్ట్రోడ్లు, ఎలక్ట్రాన్లను విద్యుత్ గా మారుస్తున్నారు.
ప్రధానమైన టెక్నాలజీలు
మొక్కల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియలో శాస్త్రవేత్తలు అనేక పరిశోధనల్ని చేస్తున్నారు. అందులో భాగంగా.. ఇప్పటికే కొన్ని పరిశోధనల్ని, టెక్నాలజీలను అభివృద్ధి చేశారు. వాటిలో..
1. ప్లాంట్ మైక్రోబయల్ ఫ్యూయల్ సెల్స్ PMFCs – దీని ద్వారా మట్టిలోని బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ప్రత్యేక ఎలక్ట్రోడ్‌ల ద్వారా అందుకోవచ్చు. మొక్కలు విడుదల చేసే రసాయనిక చర్యల్ని అందుకుని, బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంది. అక్కడ ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రోడ్ లను ఇక్కడ అందుకోనున్నారు.
2. బయో సోలార్ సెల్స్ – సూర్యుడి నుంచి ఉత్పత్తి అయ్యే శక్తిని అందుకునేందుకు విద్యుత్‌గా మార్చేందుకు మొక్కల శక్తిని ఉపయోగించుకునే ప్రత్యేకమైన బయోటెక్నాలజీ. ఇవి సాధారణ సోలార్ ఫ్యానళ్ల (solar panels) మాదిరిగానే పని చేస్తాయి. అయితే.. ఈ ప్రక్రియను మొక్కలు లేదా సూక్ష్మజీవుల సహాయంతో మెరుగుపరచడం దీని ప్రత్యేకత. మార్పు చేసిన మొక్కల కణాలు బ్యాటరీల వలే విద్యుత్‌ను నిల్వ చేసి విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
3. హైబ్రిడ్ ప్లాంట్ టెక్నాలజీ – ఈ విధానంలో శాస్త్రవేత్తలు మరింత ముందుకు వెళ్లి.. కృత్రిమ ఆకు వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో.. మొక్కల సహజ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.
మొక్కల నుంచి విద్యుత్ ఉత్పత్తి అంటేనే ఆశ్చర్యకరంగా, ఆసక్తిగా ఉన్నా.. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కానీ.. ఈ పరిజ్ఞానాన్ని అందుకునేందుకు, ఇంతటి సాంకేతికతను సాధించేందుకు అంతర్జాతీయంగా తీవ్ర పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సాంకేతికతకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాజెక్టులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వాటిలో ఒకటి.. నెదర్లాండ్స్‌లోని ప్లాంట్-ఈ అనే కంపెనీ చేపట్టిన ప్రాజెక్టు. ఇందులో.. ఈ సంస్థ వెట్లాండ్స్ లోని తేమను, వరి పొలాల్లోని నీటిని, మొక్కల వ్యవస్థను ఉపయోగించుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసి వీధి దీపాలకు అందించే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే.. మరికొంత మంది శాస్త్రవేత్తలు.. విద్యుత్ సరఫరా లేని గ్రామాల్లో తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను అందించేందుకు మొక్కల ఆధారిత విద్యుత్ వనరులు ఉపయోగపడతాయా లేదా అని పరిశీలిస్తున్నారు. అలాగే.. మొక్కల ద్వారా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను ఉపయోగించి సెన్సార్లు, ఎల్ఈడీ లైట్లు, చిన్న చిన్న గ్యాడ్జెట్లను ఛార్జ్ చేయడం సాధ్యమా? కాదా? అని పరీక్షిస్తున్నారు.
సవాళ్లు ఏంటి.?
ఈ సాంకేతికత అత్యంత ఆసక్తికరంగా ఉన్నా.. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిలో తక్కువ శక్తి ఉత్పత్తి ప్రధాన సమస్య. ప్రస్తుతం మొక్కల ఆధారిత విద్యుత్ పరిమిత పరిమాణంలో మాత్రమే లభిస్తోంది. మానవ అవసరాలకు, ఏవైనా పనులు చేపట్టేందుకు కావాల్సిన పరిమాణంలో ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ప్రస్తుత పరిశోధనలతో శాస్త్రవేత్తలు మరింత ఎక్కువ శక్తిని అందించగల మార్గాలను అన్వేషిస్తున్నారు. దీన్ని విస్తృత స్థాయిలో రూపొందించడానికి ఇంకా మరిన్ని పరిశోధనలకు భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమని భావిస్తున్నారు.
Also Read : New SIM Card Rules: కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. ఇలా చేశారో రూ. 50 లక్షల ఫైన్