New SIM Card Rules: దేశంలో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే దేశంలోని టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) కొత్త సిమ్ కార్డ్స్ విషయంలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ క్రమంలో నకిలీ పత్రాలు ఉపయోగించి లేదా గుర్తింపు లేని పత్రాల ద్వారా సిమ్ కార్డులను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం ఈ చర్యలను నేరంగా పరిగణిస్తారు.
ఈ ప్రక్రియలో భాగంగా కొన్నిసార్లు సిమ్ కార్డు అమ్మకపు దారులు కూడా ఈ మోసాలకు సహకరిస్తే, వారిపై కూడా చర్యలు తీసుకుంటారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు టెలికాం శాఖ తాజాగా ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం, టెలికాం ఐడెంటిఫైయర్‌లను తప్పుగా ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. అందుకోసం పర్యవేక్షణ విధానాన్ని మరింత కఠినం చేశాయి. తద్వారా నకిలీ కాలింగ్ లైన్ ఐడెంటిటీ (CLI), IMEI నెంబర్లను తారుమారు చేసి, వివిధ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేసే దుండగులపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.
ఈ కొత్త చట్టం ప్రకారం సిమ్ కార్డులను కొన్నప్పుడు దుర్వినియోగం జరగకుండా నిఘాను పెంచే మార్గాలను సూచించింది. ఇకపై ఎవరైనా ఐడెంటిటీ మాడ్యూల్ (SIM) లేదా టెలికాం ఐడెంటిటీ మోసం, చోరీ లేదా ఇతర అవకతవకలు చేయడం నేరంగా పరిగణించబడుతుంది. 2023 టెలికాం చట్టంలోని సెక్షన్ 42(3)(c) ప్రకారం ఇది నకిలీ, మోసపూరిత వంటి చర్యలను అరికట్టడానికి తీసుకొచ్చారు.
దీని ప్రకారం ఇలాంటి నేరాలు చేసే వ్యక్తులకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఈ చర్యలు టెలికాం సేవలను నిరోధించడానికి ఉద్దేశించబడ్డాయి. కొత్త చట్టం ఈ వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చడానికి పనిచేస్తుందని కేంద్రం వెల్లడించింది. ఈ చట్టం ద్వారా మోసం చేసే వారకి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. సాధారణంగా సైబర్ నేరగాళ్లు తమ లక్ష్యాలను సాధించడానికి పలు రకాల టెక్నికల్ వ్యూహాలను అనుసరిస్తారు. ఉదాహరణకి పౌరుల సెల్ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను సేకరించి, వాటిని ఉపయోగించి బల్క్ SMSలు పంపిస్తారు. ఇతర క్రైం సంఘటనలు చేసే క్రమంలో ఉపయోగిస్తారు.
దీంతోపాటు వారు సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (SIM) కార్డులను లేదా SMS హెడర్లను కూడా చోరీ చేసి పలు రకాల సేవల కోసం వాడుకుంటారు. మరికొన్నిసార్లు మోసగాళ్లు తమ పేరుతో వేరే వారి ప్రూఫ్ ద్వారా సిమ్ కార్డులను కొనుగోలు చేసి, తరువాత వాటిని ఇతరులకు అందిస్తారు. ఇలాంటి అనేక రకమైన చర్యల ద్వారా సిమ్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి. ప్రస్తుతం అమల్లోకి రానున్న కొత్త చట్టం ద్వారా ఇకపై నకిలీ సిమ్ కార్డులు తీసుకునే వారిని కట్టడి చేసే అవకాశం ఉంది. దీంతోపాటు క్రమంగా సైబర్ క్రైం నేరాలు కూడా తగ్గే ఛాన్సుంది.