భూమికి రెండు చివర్ల ధృవాలు ఉంటాయని మనకు తెలుసు. ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయాలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయని కూడా తెలుసు. ఆ మంచు కింద ఏముంటుంది..? మళ్లీ మంచే ఉంటుంది. ఇలా ఎంత దూరం ఉంటుంది..? ఎంత దూరమైనా మంచే ఉంటుంది. ఇప్పటి వరకు ఇలానే అనుకున్నారంతా. కానీ మంచు ఫలకాల కింద మరో ప్రపంచం ఉందని, అది 3.4కోట్ల సంవత్సరాల కిందటిదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తూర్పు అంటార్కిటికాలో దట్టమైన మంచు కింద మనకు తెలియని మరో వాతావరణం ఉందని వారు అంటున్నారు. అయితే ఇది మంచు కింద 2 కిలోమీటర్ల లోతున అలా భద్రపరచబడి ఉందని చెబుతున్నారు.
మనం ఇంతవరకు చూడనిది..
దట్టమైన మంచు ప్రాంతంలో వస్తువులు ఎన్నేళ్లయినా అలా చెక్కుచెదరకుండా ఉంటాయి. కుళ్లిపోవడం, కృశించి పోవడం అరుదు. సరిగ్గా ఈ పాయింట్ డర్హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలను ఆకర్షించింది. స్టీవర్ట్ జామిసన్ నేతృత్వంలోనే ఓ బృందం వెంటనే అంటార్కిటికాకు వెళ్లి పరిశోధనలు మొదలు పెట్టింది. దట్టమైన మంచు ఫలకాల కింద 2 కిలోమీటర్ల లోతున మనం ఇంతవరకు చూడని ఓ అద్భుత వాతావరణం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అయితే అది ధృవాల వద్ద మొదలైన వాతావరణం కాదు. భూమి ఏర్పడిన తర్వాత భూభాగం అంతా ఒకే ఖండంలా ఉండేదని, అది క్రమక్రమంగా విడిపోయిందనే వాదన ఉంది. అలా భూమి అంతా ఒకే ఖండంలా ఉన్నప్పుడు ఏర్పడిన వాతావరణం క్రమక్రమంగా ధృవాల వద్దకు చేరి అక్కడ అలాగే భద్రపరచబడిందని అంటున్నారు. అది ఒక కోటి చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉంటుందని అంటున్నారు. అది మంచుతో ఘనీభవించుకు పోయిందని, దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు.
ఎందుకీ ప్రయోగం..?
ప్రస్తుతం హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయి. వాటి వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి. అయితే డర్హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల ప్రయోగం విజయవంతం అయితే వాతావరణంలో వస్తున్న ఈ పెను మార్పుల్ని కాస్తయినా అడ్డుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణం ఏర్పడక ముందు భూమి ఎలా ఉంది..? ఏయే జంతుజాలాలు ఉన్నాయి..? వాటి వల్ల ఉపయోగాలేంటి..? ఇప్పుడవి ఎందుకు లేవు అనే దిశగా ప్రయోగాలు జరపబోతున్నారు. ఇది ఒక టైమ్ క్యాప్స్యూల్ ని వెలికి తీయడం లాంటిదని చెబుతున్నారు.
ఎలా కనుగొన్నారంటే..?
RADARSAT ఉపగ్రహ వ్యవస్థను ఉపయోగించి, శాస్త్రవేత్తలు మంచు ఉపరితలం యొక్క వాలులో సూక్ష్మమైన మార్పులను మొదటగా గమనించారు. దీని ద్వారా వారు అప్పడు ఏం జరిగిందనేది ఊహించారు. ధృవాలు ఉనికిలోకి రావడానికి చాలాకాలం ముందు ఉన్న వాతావరణం ఆ మంచు ఫలకాల కింద భద్రంగా ఉందని బావిస్తున్నారు. దాన్ని బహిర్గతం చేయడానికి తమకు లభించిన ఆధారాలు సరిపోతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
ఎలా వెలికి తీస్తారు..?
తాము ఊహిస్తున్న వాతావరణాన్ని, అప్పటి భూ భాగాన్ని వెలికిదీయడానికి పెద్ద సాహసమే చేస్తున్నారు శాస్త్రవేత్తలు. లోతుగా తవ్వడానికి రేడియో-ఎకో సౌండింగ్ (RES) ని వాడబోతున్నారు. కంప్యూటర్ నమూనాలను ఉపయోగించి దిగువన ఉన్న భూమిని అధ్యయనం చేశారు. ఈ పురాతన వాతావరణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా.. తూర్పు అంటార్కిటిక్ మంచు పలక (EAIS).. ప్రస్తుత భూతాపాన్ని ఎలా తట్టుకోగలదు అనే విషయాన్ని అధ్యయనం చేయవచ్చు.