ఏపీ రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఆ చర్చను కొనసాగించిన సాక్షి టీవీ ఉద్యోగి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఉచ్చు బిగిసేలా ఉంది. ఇప్పటికే మహిళా లోకం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండగా.. పోలీసులకు పలు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ సహా పలువులు ఇతర నేతలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. ఈమేరకు ఆయన ఓ ఘాటు ట్వీట్ వేశారు.
గౌతమ బుద్దుడి ఆనవాళ్లు ఉన్న నేల అమరావతి. అలాంటి బౌద్ధం విలసిల్లిన
ప్రాంతాన్ని ycp టీవీ ఛానెల్ ద్వారా రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని కామెంట్ చేయించారు అంటే అక్కడ ఉన్న- ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ, కాపు, ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా? ఈ ప్రాంతంలో బౌద్ధం…— Pawan Kalyan (@PawanKalyan) June 8, 2025
అమరావతిపై విషం చిమ్ముతారా..?
ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతంపై చెడు ముద్ర వేయడమే ఆ ముఠా దురుద్దేశం అని మండిపడ్డారు పవన్ కల్యాణ్. అమరావతిపై కుట్రలు చేసినవారిపైనా, దుష్ప్రచారం చేసిన వ్యక్తులపైనా, వారి వెనుక ఉన్నవారిపైనా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోడానికి వెనకాడదని అన్నారు పనవన్. అమరావతిపై నీఛమైన వ్యాఖ్యలు చేసినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు చెప్పారు.
మహిళల్ని అవమానిస్తారా..?
గౌతమ బుద్దుడి ఆనవాళ్లు ఉన్న నేల అమరావతి అని, బౌద్ధం విలసిల్లిన నేల ఇదని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. అలాంటి పవిత్రమైన ప్రాంతాన్ని వైసీపీ టీవీ ఛానెల్ ద్వారా వేశ్యల రాజధానిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల మహిళలల్ని వారు అవమానించారని చెప్పారు. అమరావతి ప్రాంత చారిత్రక ప్రాధాన్యాన్ని, ఆధ్యాత్మిక విశిష్టతను కూడా వారు అవహేళన చేసినట్లేనని అన్నారు.
వ్యవస్థీకృత కుట్ర
విశ్లేషకుడు, జర్నలిస్టు ముసుగులో వారు చేసిన దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. ఈ విషయాన్ని ప్రజలు, అధికార యంత్రాంగం లోతుగా విశ్లేషించాలని కోరారు. ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దని చెప్పారు. ఆ వ్యక్తి వ్యాఖ్యలకు తమ ఛానెల్ కు సంబంధం లేదని చెప్పడం మరింత బాధ్యతారాహిత్యం అని అన్నారు. ఆ వ్యాఖ్యల్ని టీవీ ఛానెల్ యాజమాన్యం ఖండించలేదని, కనీసం తప్పు అని కూడాచెప్పలేదని అది మరింత దారుణమైన విషయం అని విమర్శించారు పవన్.
మొత్తమ్మీద అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై వెంటనే అరెస్ట్ లు జరగలేదు కానీ.. ఆ ఇద్దరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో సాక్షి ఛానెల్ కూడా ఈ వ్యవహారానికి ముగింపు పలికేలా కనిపించడం లేదు. కనీసం క్షమాపణ కూడా కోరకపోవడం విశేషం. ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ ద్వారా తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ పై కూడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతున్నట్టు టీడీపీ వర్గాలంటున్నాయి. రాజధానిని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు అంటున్నారు.