Scientists:- గాలిలో కలుస్తున్న కార్బన్ డయాక్సైడ్‌ను ఎంత వీలైతే అంత తొందరగా అదుపు చేయాలని లేకపోతే మానవాళికి తీవ్ర నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఈ కోణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి చాలామంది ముందుకు రావడం లేదు. అందుకే శాస్త్రవేత్తలే తమవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. వివిధ ప్రయోగాలతో ముందుకొస్తున్నారు. ఇదే కోణంలో వారు మరో కొత్త ప్రయోగాన్ని మొదలుపెట్టారు.
కార్బన్ డయాక్సైడ్‌లో పీల్చుకునే విధంగా పలు పరికరాలను ఇప్పటికే సిద్ధం చేశారు శాస్త్రవేత్తలు. అయితే ప్రస్తుతం గాలిలో ఉన్న కార్బన్ శాతాన్ని అదుపు చేయడానికి ఇవి మాత్రం సరిపోవని వారికి తెలుసు. అందుకే అలాంటి మరెన్నో ప్రయోగాలతో వారు బిజీగా ఉన్నారు. తాజాగా సముద్రంలో ఏర్పడే అలలు కూడా కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకోగలవని వారు గుర్తించారు. అందుకే అలలను సృష్టించడం కోసం ఒక కొత్త యంత్రాన్ని తయారుచేశారు.
గాలిలో పెరుగుతున్న కాలుష్యం వల్లే వాతావరణంలో ఈ హానికరమైన మార్పులు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దాని కారణంగానే గ్లోబల్ వార్మింగ్ కూడా ఏర్పుడుతుందని వారు తెలిపారు. అందుకే పైపులు, ట్యాంకులతో వింతగా కనిపించే ఒక బార్జ్ లాంటి ఆకారాన్ని లాస్ ఏంజెల్స్‌లోని సముద్రంలో వారు ఏర్పాటు చేశారు. ఇది అలలను సృష్టిస్తుందని వారు చెప్తున్నారు. అలా సముద్రంలో ఏర్పడిన అలలు గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుంటాయని వారు తెలిపారు.
లాస్ ఏంజెల్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు గత రెండేళ్లుగా సీఛేంజ్ అనే ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు. గాలిలో విపరీతంగా పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్‌తో పాటు గ్రీన్‌హౌస్ గ్యాసులను సముద్రాల ద్వారా పీల్చుకునేలా చేయాలన్నదే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. సముద్రాలను హానికరమైన గ్యాసులను పీల్చుకునే స్పాంజ్‌లాగా చేయాలన్నదే వారి టార్గెట్. ప్రపంచవ్యాప్తంగా భూమిపై ఉన్న నేల శాతం కంటే సముద్రాల శాతమే ఎక్కువ. అందుకే సముద్రాలనే వారు హానికరమైన గ్యాసులకు చెక్ పెట్టడం కోసం ఎంచుకున్నారు.
ప్రస్తుతం ఉన్న వాతావరణ మార్పులు సముద్రాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అందుకే సముద్రాలలో కూడా పీల్చుకునే శక్తి తగ్గిపోతోంది. ఇది ప్రస్తుతం శాస్త్రవేత్తలకు పెద్ద ఛాలెంజ్‌లాగా మారింది. ఇప్పటికే సముద్రాల్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ను బయటికి పంపడం కోసం ఎలక్ట్రోకెమికల్ అనే పద్ధతిని ఏర్పాటు చేశారు. దీని సాయంతో మళ్లీ సముద్రాలకు పీల్చుకునే శక్తిని ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే సముద్రాల ద్వారా కాలుష్యం అనేది అదుపులోకి వస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.