భారతీయ అంతరిక్ష వ్యోమగామి శుభంశు శుక్లా చరిత్రను సృష్టించిన సంగతి తెలిసినదే. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో వ్యోమగామిగా ఆయన రికార్డు సృష్టించారు. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రక ప్రయాణంలో శుభాంశు శుక్లా తన వెంట కొన్ని వస్తువులను తీసుకెళ్లారు. వాటిలో తనకిష్టమైన ఆహారం కూడా ఉంది.
శుభాంశు శుక్లా తనకు ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వా, మామిడి తాండ్ర వంటివి తనతో పాటు అంతరిక్షానికి తీసుకెళ్లారు. అవంటే అతనికి ఎంతో ఇష్టం. వాటితో పాటు ఒక జీవిని కూడా తీసుకెళ్లారు శుభాంశు శుక్లా. ఆ జీవి ఏమిటో దాన్ని ఎందుకు తీసుకెళ్లారో తెలుసుకోండి.
ఏమిటా జీవి?
అతి సూక్ష్మజీవి టార్టిగ్రేడ్. దీన్ని వాటర్ బేర్ లేదా మాస్ పిగ్లెట్ అని కూడా పిలుస్తారు. ఇది కంటికి కనిపించనంత సూక్ష్మజీవి. ఇది కేవలం భూమి పైనే కాదు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా జీవించగలదు. 150 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. మైనస్ 200 డిగ్రీల చలిని తట్టుకోగలదు. శుభాంశు శుక్లా అంతరిక్షానికి వెళుతూ ఈ టార్టిగ్రేడ్ అనే సూక్ష్మజీవిని కూడా తీసుకొని వెళ్లారు.
ఈ జీవులు ఎంతో ప్రత్యేకమైనవి. మనిషి కంటే వందల రెట్లు ఎక్కువ ఉన్నా రేడియేషన్ ను కూడా ఇవి తట్టుకోగలవు. ఏమీ తినకుండా, తాగకుండా 30 ఏళ్లకు పైగా జీవించగలవు. ఈ జీవులు కేవలం సముద్రంలో మాత్రమే కనిపిస్తాయి. ఇప్పటికే ఈ జీవి పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. అయితే ఈ జీవిని శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు.
అధ్యయనం కోసం
ఇలా ఆయన ఈ జీవిన తీసుకువెళ్లడానికి కారణం దానిపై అధ్యయనం చేయడమే. అంతరిక్ష శూన్యత, గురుత్వాకర్షణ లేని చోట ఈ జీవి ఎలా జీవించగలుగుతుందో… రేడియేషన్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులను కూడా తట్టుకొని ఎలా బతకగలుగుతుందో అధ్యయనం చేయడానికి శుభాంశు శుక్లాతో పాటు అతని బృందం ఈ జీవిని అంతరిక్షంలోకి తీసుకువెళ్లారు. ఎంత కఠినమైన వాతావరణంలోనైనా జీవించడం ఈ జీవుల ప్రత్యేకత. దీనిపై పరిశోధనలు చేయడం ద్వారా అంతరిక్షంలో మానవ జీవితాన్ని మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చు అన్నది పరిశోధకుల విశ్వాసం. అందుకే ఈ జీవి జీవసంబంధమైన లక్షణాలు, డిఎన్ఏ మరమ్మత్తు విధానాలను తెలుసుకోబోతున్నారు. ఈ పరిశోధన విజయవంతం అయితే మానవ జీవితాన్ని అంతరిక్షంలో స్థిరంగా ఉంచే దిశగా ఒక విప్లవాత్మకమైన అడుగు పడినట్టే.
యాక్సియం 4 మిషన్ పేరుతో శుభాంశు శుక్లాతో పాటూ ముగ్గురితో కలిసి అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఇది ఒక వాణిజ్య మిషన్. ఈ మిషన్ కేవలం శాస్త్రీయ ప్రయోగమే కాదు మన దేశానికి గర్వకారణమైనది. భారతీయ శాస్త్రవేత్తలు దీనికి నాయకత్వం వహిస్తున్నారు.
శుభాంశు శుక్లా అక్టోబర్ 10, 1985న లక్నోలో జన్మించారు. భారత వైమానిక దళంలో పనిచేశారు. 2000 గంటలకు పైగా విమాన ప్రయాణాన్ని ఆయన పూర్తి చేశారు. 2006లో ఐఏఎఫ్ లో చేరిన శుభాంశు ఫైటర్ జెట్ లను నడిపిన ప్రావీణ్యం ఉంది. 2019లో ఆయన వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఇందుకోసం రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో కఠినమైన ట్రైనింగును కూడా పొందారు.