Honda Rebel 500: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లోకి మరో కొత్త క్రూయిజర్ బైక్‌ను తీసుకొచ్చింది. తన పాపులర్ మోడల్ రెబెల్ 500ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధరను రూ.4.50 లక్షలుగా, ఇ-క్లచ్ వేరియంట్ ధరను రూ.4.90 లక్షలుగా నిర్ణయించింది. గతంలో కంటే తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో ఈ బైక్ ఇప్పుడు మరింత సరికొత్తగా రూపొందింది.
హోండా రెబెల్ 500 బుకింగ్స్ ను దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. ఆసక్తి ఉన్నవారు రూ.5,000 చెల్లించి బైక్ ను బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ మోడల్ కేవలం హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో మాత్రమే విక్రయించనున్నారు. మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ రంగుల్లో ఇది లభిస్తుంది.
ఈ క్రూయిజర్ బైక్‌లో 471సీసీ, లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అందించారు. ఇది 8,500 ఆర్‌పీఎం వద్ద 46 హెచ్‌పీ పవర్, 6,000 ఆర్‌పీఎం వద్ద 43.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్ బాక్స్ ను జత చేశారు. సుదూర ప్రయాణాలతో పాటు నగర ప్రయాణాలకు కూడా అనువుగా ఉండేలా దీన్ని రూపొందించారు.
రెబెల్ 500లో ఇ-క్లచ్ వేరియంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా క్లచ్ లివర్‌ను ఉపయోగించకుండానే బైక్‌ను స్టార్ట్ చేయవచ్చు, ఆపవచ్చు. అలాగే గేర్లను కూడా మార్చుకోవచ్చు. అవసరమైతే సాధారణ బైక్‌ల మాదిరిగా క్లచ్ లివర్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే, ఈ మోడల్ కోసం అదనంగా రూ.40,000 చెల్లించాలి.
ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త 3.5 అంగుళాల రౌండ్ TFT డిస్‌ప్లేను అందించారు. ఇందులో హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ సదుపాయాలు ఉన్నాయి. వీటితో పాటు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (ట్రాక్షన్ కంట్రోల్) లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌లో 690 ఎంఎం సీట్ హైట్ ఉండటం మరో ప్రత్యేకత. తక్కువ ఎత్తు ఉన్నవారు కూడా ఈజీగా బైక్‌పై కూర్చోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని బరువు 191 కిలోలు కాగా, 16 అంగుళాల వీల్స్ ను ఏర్పాటు చేశారు.
హోండా గతంలో రెబెల్ 500ను దేశంలో CBU దిగుమతిగా అమ్మింది. అప్పుడు దీని ధర రూ.5.12 లక్షలుగా ఉండేది. ఇప్పుడు సుమారు 50 శాతం ఇక్కడే తయారు చేస్తుండటంతో ధర తగ్గింది. గత ధరతో పోలిస్తే ప్రారంభ ధర సుమారు రూ.62,000 తక్కువగా ఉంది. ప్రస్తుతం రూ.4.01 లక్షల నుంచి లభిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650కు ఇది పోటీగా నిలవనుంది. రానున్న రోజుల్లో ఇంజిన్‌ను కూడా స్థానికంగా తయారు చేస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
Read Also: పల్సర్ NS125లో అదిరిపోయే అప్‌డేట్.. ఇక బైక్ స్క్రీన్‌పైనే గూగుల్ మ్యాప్స్!