Roof Cooling Tips: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ఫలితంగా ఇంటిమీద నేరుగా సూర్యకిరణాలు పడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అయితే 4 సులువైన చిట్కాలు పాటించడం ద్వారా ఇంటి పైకప్పును కూల్ గా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఏసీలు, కూలర్లు అవసరం లేకుండానే ఇంటిని చల్లగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవి? అవి ఏ విధంగా పనిచేస్తాయో ఈ కథనంలో చూద్దాం.
ఇంటి పైకప్పును సూర్య కిరణాల నుంచి రక్షించడంలో కూల్ పెయింట్ అద్భుతంగా పనిచేయనుంది. ఇంటి పైకప్పుకు తెల్లటి సున్నం (Lime) లేదా మార్కెట్లో దొరికే కూల్ రూఫ్ కోటింగ్ పెయింట్ వేయండి. తెల్ల రంగు సూర్యకిరణాలను తిరిగి వెనక్కి పంపేస్తుంది. దీనివల్ల స్లాబ్ వేడెక్కదు. ఇది తక్కువ ఖర్చుతో ఒక్క రోజులో ఫినిష్ చేయవచ్చు.
ఇంట్లో ఉండే ఖాళీ జూట్ (గోనె) సంచులు లేదా కొబ్బరి పీచును ఇంటి పైకప్పును కూల్ గా ఉంచేందుకు ఉపయోగించవచ్చు. ఇందులో భాగంగా తొలుత శ్లాబ్ మీద గోనె సంచులను పరవండి. అనంతరం రోజుకు రెండు లేదా మూడు సార్లు వాటిపై నీళ్లు చల్లండి. ఆ తేమ వల్ల పైకప్పు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఫలితంగా ఇంటి గదుల్లోకి వేడి అస్సలు రాదు.
ఇంటి డాబా పైన కుండీలలో చిన్న చిన్న మొక్కలు, ఆకుకూరలు, తీగ జాతి మొక్కలను పెంచండి. మొక్కల నీడ నేరుగా స్లాబ్‌పై పడటం వల్ల పైకప్పు వేడెక్కదు. పైగా మొక్కలకు మనం పోసే నీరు కూడా రూఫ్‌ను చల్లబరుస్తుంది. దీనివల్ల ఇల్లు చల్లబడటంతో పాటు.. తాజా కూరగాయలు కూడా లభిస్తాయి.
Also Read: సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ!
డాబా పైన ఖాళీ మట్టి కుండలను బోర్లించి పెట్టడం లేదా ఎర్ర ఇటుకలను ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఇస్తూ అమర్చడం వల్ల సూర్యకిరణాలు నేరుగా సిమెంట్ స్లాబ్‌పై పడవు. పైగా ఆ ఇటుకల మధ్య నుండి గాలి ప్రవహించడం వల్ల వేడి కిందకు దిగకుండా ఆగిపోతుంది. తద్వారా ఇంట్లోని గదులు చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటాయి.
Also Read: అధికారంలోకి వస్తే.. హైదరాబాద్‌లో 24 గంటల తాగునీరు.. కేటీఆర్ కీలక హామీ!