Robot Vacuum: సాంకేతికత మన జీవితాల్లోకి ఎంతలా వచ్చి చేరిందో చెప్పడానికి ఓ విచిత్ర సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. తైవాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. తన భార్యపై అనుమానంతో రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ ను స్పై మిషన్ గా మార్చేశాడు. అందులోని కెమెరాను ఉపయోగించి.. భార్యపై నిఘా పెట్టాడు. ఇది అతడికి ఒకింత కలిసి వచ్చినప్పటికీ.. చివరికి జైలు పాలు అయ్యేలా చేసింది. అసలేం జరిగిందో ఈ కథనంలో చూద్దాం.
2021లో వివాహం చేసుకున్న ఆ జంట.. పండుగల సమయంలో తమ హాలిడే హోమ్‌కు వెళ్లేవారు. అయితే 2023 సెప్టెంబరులో ఆ ఇంట్లో ఒక వాడిన టూత్‌బ్రష్ కనిపించడంతో భర్తకు అనుమానం మొదలైంది. ఎవరో పరాయి వ్యక్తి అక్కడికి వస్తున్నారని భావించిన అతను.. ఆధారాలు సేకరించాలని నిర్ణయించుకున్నాడు.
2023 డిసెంబర్ లో భర్త తన మొబైల్ యాప్ ద్వారా హాలిడే హోమ్‌లోని రోబో వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఆన్ చేశాడు. ఆ పరికరంలో ఉన్న ఆడియో, లైవ్ వీడియో ఫీచర్ సహాయంతో భార్య వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండగా ప్రత్యక్షంగా చూశాడు. ఆ దృశ్యాలను వెంటనే రికార్డ్ చేసి భద్రపరిచాడు.
ఆ రికార్డింగ్‌ను ఆధారంగా చేసుకుని తన వివాహ హక్కులకు భంగం కలిగించారంటూ భార్య, ఆమె ప్రియుడిపై కోర్టులో దావా వేశాడు. రూ. 2 మిలియన్ల పరిహారం (సుమారు రూ. 60.2 లక్షలు) డిమాండ్ చేశాడు. విచారణ జరిపిన సివిల్ కోర్టు.. వివాహేతర బంధాన్ని నిర్ధారిస్తూ భర్తకు రూ.5 లక్షల న్యూ తైవాన్ డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
అయితే సివిల్ కేసులో విజయం సాధించినప్పటికీ భర్తకు ఊరట లభించలేదు. తన అనుమతి లేకుండా వ్యక్తిగత దృశ్యాలను చిత్రీకరించాడంటూ భార్య క్రిమినల్ కేసు పెట్టింది. సివిల్ కోర్టులో ఈ ఆధారాలను సమర్థించిందని భర్త వాదించినా.. క్రిమినల్ కోర్టు దానిని తోసిపుచ్చింది. భార్యాభర్తల బంధం ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ హక్కులను కాలరాసేలా ఉండకూడదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
Also Read: జురాసిక్ పార్క్ తరహాలో.. డైనోసార్లను తిరిగి సృష్టించొచ్చా? సైన్స్ ఏం చెబుతోంది!
అయితే వ్యాక్యూమ్ క్లీనర్ పనిచేస్తున్నప్పుడు లైట్లు, శబ్దాలు వస్తాయని అందువల్ల రికార్డింగ్ జరుగుతున్నట్లు భార్యకు తెలుసని భర్త వాదించాడు. కానీ అతడి వాదనతో కోర్టు అంగీకరించలేదు. అనుమతి లేకుండా సీక్రెట్‌గా రికార్డ్ చేసినందుకు గాను అతనికి 5 నెలల జైలు శిక్షతో పాటు 1,50,000 న్యూ తైవాన్ డాలర్లు (సుమారు రూ. 4.5 లక్షలు) జరిమానా విధించింది.
Also Read: మనిషి లేని భూమికి.. కొత్త బాస్ ఎవరో తెలుసా? సైన్స్ చెప్పే షాకింగ్ నిజాలు!