Only iphones Stolen| స్మార్ట్‌ఫోన్ అంటే ఈ రోజుల్లో అందరికీ ఒక అవసరమైన వస్తువుగా మారిపోయింది. అందుకే ప్రతి ఒక్కరి చేతుల్లో ఇదే కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లు చాలా ఖరీదు కావడంతో దొంగలు వీటిని ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్ దొంగల్లో కూడా ఐఫోన్ దొంగలు వేరయా అన్నట్లు ఒక నగరంలో వింత చోరీలు జరుగుతున్నాయి. ఆ నగరంలోని ఫోన్ దొంగలు ఎక్కువగా ఐఫోన్స్ మాత్రమే దొంగతనం చేస్తున్నారు.
ప్రపంచంలోనే ఫేమస్ నగరమైన లండన్ లో ఇప్పుడు దొంగతనాల ఒక వింత ట్రెండ్ వైరల్ అవుతోంది. దొంగలు.. ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్స్ మాత్రమే దొంగిలిస్తున్నారు. పొరపాటున ఆండ్రాయిడ్ ఫోన్ (శామ్‌సంగ్, గూగుల్, వన్‌ప్లస్ వంటివి) దొంగిలిస్తే… దొంగలు తిరిగి వచ్చి యజమానికే ఇచ్చేస్తున్నారు! ఇదంతా న్యూస్ లో చదివి అంతా నవ్వు కుంటున్నారు. కానీ లండన్ ప్రజల్లో మాత్రం ఈ ఘటనల గురించి తెలిసి భయం, ఆశ్చర్యం కలుగుతున్నాయి. లండన్ రోడ్లపై ప్రజలు చేతిలో ఐఫోన్ పట్టుకొని తిరగడం చూస్తే.. దొంగలు “బింగో!” అనుకుంటారు. ఆండ్రాయిడ్ తీస్తే “సారీ బ్రో, పొరపాటు!” అని తిరిగి ఇస్తారు. నవ్వొస్తోందా? కానీ ఇది నిజం!
సామ్ అనే యువకుడు దక్షిణ లండన్‌లో వెళ్తుండగా 8 మంది దొంగలు అతన్ని చుట్టుముట్టారు. అతడిని కొట్టి, కెమెరా, ఫోన్ లాక్కెళ్లారు. కొద్ది నిమిషాలకే ఒక దొంగ తిరిగి వచ్చాడు. సామ్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేశాడు. అతడితో దొంగ ఇలా అన్నాడు. “సామ్‌సంగ్ వద్దు బ్రో, నో సామ్‌సంగ్!” అంటూ తిరిగి ఇచ్చేశాడు. ఇదంతా చూసిఆశ్చర్యంగా సామ్ నోరెళ్లబెట్టాడు – “నా ఫోన్ తిరిగి వచ్చింది కానీ… వీళ్లే రకం దొంగలు.. దొంగతనం చేసిన ఫోన్‌ని తిరిగి ఇచ్చేశారు !” అని మీడియాకు వివరిస్తూ చెప్పాడు.
మార్క్ అనే ఇంకో వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. బైక్ మీద వచ్చిన ఒక దొంగ అతడి శామ్‌సంగ్ ఫోన్ లాక్కెళ్లాడు. మార్క్ వెనక్కి పరుగెత్తాడు. కానీ కొంచెం దూరం వెళ్లాక దొంగ బైక్ ఆపి, ఫోన్‌ను నిదానంగా నేల మీద పెట్టి వెళ్లిపోయాడు. ఫోన్ పూర్తిగా సేఫ్! ఇలాంటి సంఘటనలు ఇప్పుడు లండన్‌లో ఎక్కడ చూసినా జరుగుతున్నాయి. కానీ ఐఫోన్స్ దొంగతనం కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం.. ఐఫోన్‌లు రీసేల్ మార్కెట్‌లో మంచి రేటుకి ఈజీగా సేల్ అవుతున్నాయి. ఒక సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌కు మిగతా బ్రాండ్లతో పోలిస్తే.. రెండు-మూడు రెట్లు ధర వచ్చేస్తుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ కు అంత డిమాండ్ లేదు. రెండు ఫోన్‌లలోనూ గట్టి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అన్‌లాక్ చేయడం కష్టమే. అందుకే దొంగలు “టైం వేస్ట్ చేయకుండా ఎక్కువ డబ్బు ఇచ్చే ఐఫోన్‌నే కాజేస్తే ఎక్కువ లాభం పొందవచ్చు.” అని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు ఈ ట్రెండ్ గురించి తెలుసుకున్నారు. కానీ వాళ్ల డేటాలో ఏ బ్రాండ్ ఫోన్ దొంగతనమైందని లేదు. కానీ ఫోన్ దొంగలను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే.. ఫోన్ స్వేచ్ఛగా చేతిలో పట్టుకొని తిరగవద్దని సూచించారు.
Also Read: హెడ్‌ఫోన్స్‌లో సమస్య వస్తే ఫ్రిజ్‌లో పెట్టండి.. వైరల్ అవుతున్న వింత ట్రెండ్