Upcoming Smartphones 2026: నవంబర్ నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్లు కనిపిస్తున్నాయి. వివో, ఒప్పో, షావోమీ, మోటరోలా, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లు కొత్త ఫోన్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని మోడళ్ల లాంచ్ వివరాలు ఇప్పటికే బయటకు రాగా.. మరికొన్నింటిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కెమెరా, బ్యాటరీ, పనితీరు విషయంలో ఈ ఫోన్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.
వివో X500 సిరీస్ నవంబర్ చివర్లో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో X500, X500 Pro, X500 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఉన్నప్పటికీ.. భారత్‌కు ఏవి వస్తాయో ఇంకా స్పష్టత లేదు. అక్టోబర్ 28న గ్లోబల్ మార్కెట్‌లో ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు పరిచయమయ్యాయి. ప్రో మ్యాక్స్‌లో కదిలే వస్తువులను ఫోకస్ చేసే కెమెరా ఫీచర్, 4K స్లోమోషన్ వీడియో సపోర్ట్ ఉండొచ్చని సమాచారం.
ఒప్పో రెనో 17 సిరీస్ నవంబర్‌లో చైనాలో విడుదల కానుంది. సాధారణ మోడల్‌లో 6.5 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh స్థాయి బ్యాటరీ ఉండొచ్చు. రెనో 17 ప్రోలో 6.3 అంగుళాల స్క్రీన్, 7,200mAh స్థాయి బ్యాటరీ వచ్చే అవకాశం ఉంది. రెండు ఫోన్లలోనూ 50MP పెరిస్కోప్ కెమెరా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
షావోమీ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ నవంబర్‌లో గ్లోబల్ మార్కెట్‌లోకి రానున్నాయి. సెప్టెంబర్‌లోనే చైనాలో విడుదలైన ఈ ఫోన్లలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్లు ఉన్నాయి. యూరప్ రిటైలర్ లిస్టింగ్ ప్రకారం ధరలు సుమారు రూ.1.5 లక్షలు, రూ.1.89 లక్షల నుంచి ప్రారంభం కావొచ్చు. భారత్‌లో విడుదల తేదీ మాత్రం తెలియాల్సి ఉంది.
Also Read: ఇకపై రీల్స్ వైరల్ అవ్వడం చాలా ఈజీ.. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ఇన్‌స్టాగ్రామే చెప్తుంది!
మోటరోలా సిగ్నేచర్ 27 గ్లోబల్ లాంచ్‌ను నవంబర్ 5కు ప్రకటించింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 17, 12GB ర్యామ్‌తో రావొచ్చని బెంచ్‌మార్క్ వివరాలు చెబుతున్నాయి. ఏడు సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ తెలిపింది. భారత్‌లోనూ నవంబర్‌లోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
వన్‌ప్లస్ 16 ఇప్పటికే చైనాలో విడుదలైంది. భారత్‌లో లాంచ్‌పై ఇంకా అధికారిక సమాచారం లేదు. అయితే భారతీయ, గ్లోబల్ సాఫ్ట్‌వేర్ వెర్షన్లను పరీక్షిస్తున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఇందులో 6.78 అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 185Hz రిఫ్రెష్ రేట్, 9,000mAh బ్యాటరీ, 200MP ప్రధాన కెమెరా ఉన్నాయి. గ్లోబల్ విడుదలపై స్పష్టత కోసం వేచి చూడాలి. కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ధరలతో పాటు భారత్‌లో లభించే మోడళ్లు, సర్వీస్ సపోర్ట్ వివరాలు కూడా చూసుకోవడం మంచిది. ఎందుకంటే.. చైనాలో విడుదలైన ప్రతి మోడల్ మన దగ్గర అదే ఫీచర్లతో వస్తుందని చెప్పలేం. అధికారిక ప్రకటన వచ్చాకే కొనుగోలు నిర్ణయం తీసుకోవచ్చు.
Also Read: రూ.15 వేలకే 7000mAh బ్యాటరీ 5G ఫోన్.. అమెజాన్‌లో 4 రియల్‌మీ ఫోన్లపై మతిపోయే ఆఫర్లు!