Instagram AI Assistant: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే వాళ్లకు ఒక పెద్ద సందేహం ఉంటుంది. ఏ వీడియో పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి? ఎలాంటి కంటెంట్ చేస్తే కొత్త ఫాలోవర్లు పెరుగుతారు? ఇప్పటివరకు ఈ విషయాలు తెలుసుకోవాలంటే పాత రీల్స్ పనితీరును పరిశీలిస్తూ.. ఇన్‌సైట్స్ చెక్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇకపై ఈ పని మరింత సులభం కానుంది. ఎందుకంటే.. మెటా తమ ఎడిట్స్ యాప్‌లో కొత్త AI Assistantను తీసుకొస్తోంది. ఇది మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను పరిశీలించి, తర్వాత ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలో సలహాలు ఇస్తుంది.
మెటాకు చెందిన ఎడిట్స్ యాప్‌లో ఈ కొత్త ఏఐ అసిస్టెంట్ అందుబాటులోకి రానుంది. ఇది మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పనితీరును పరిశీలిస్తుంది. మీ రీల్స్‌కు వస్తున్న వ్యూస్, లైక్స్, కామెంట్స్, షేర్లు, ఫాలోవర్ల పెరుగుదల వంటి వివరాలను గమనిస్తుంది. అలాగే వీడియోలను ఎంతసేపు చూస్తున్నారు? ఏ అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? అనే విషయాలను కూడా అర్థం చేసుకుంటుంది. వీటన్నింటినీ బట్టి మీ అకౌంట్‌కు సరిపోయే కంటెంట్ ఐడియాలను సూచిస్తుంది.
Also Read: ఇంటర్నెట్ అక్కర్లేదు.. భారత్ సొంతంగా తీసుకొచ్చిన స్వదేశీ పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్ ఇవే!
కొన్ని రీల్స్‌కు లక్షల్లో వ్యూస్ వస్తుంటే.. మరికొన్ని వీడియోలు కనీసం కొంతమందికి కూడా చేరవు. దీనికి కారణం ఏంటో చాలామంది క్రియేటర్లకు అర్థం కాదు. ఇలాంటి సమస్యలకు ఈ ఏఐ అసిస్టెంట్ సమాధానం చెప్పేలా రూపొందిస్తున్నారు. ఏ వీడియోలను ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు? ఎక్కడ వీడియోను ఆపేస్తున్నారు? ఏ అంశాల వల్ల కొత్త ఫాలోవర్లు వస్తున్నారు? వంటి విషయాలను తెలుసుకోవచ్చు. దీంతో కేవలం అంచనాలతో కాకుండా, అకౌంట్ పనితీరును బట్టి తర్వాతి వీడియోలు చేయవచ్చు.
ఈ AI Assistant సలహాలు మాత్రమే ఇస్తుంది. మీ తరఫున వీడియోలు తయారు చేయడం లేదా ఏం పోస్ట్ చేయాలో నిర్ణయించడం దీని పని కాదు. ఏ ఐడియాను ఎంచుకోవాలి? వీడియోను ఎలా తీయాలి? అనే నిర్ణయాలు క్రియేటర్లే తీసుకోవచ్చు. అంటే.. సొంత ఆలోచనలకు ఇబ్బంది లేకుండానే ఏఐ సాయం పొందవచ్చు.
ఈ ఫీచర్‌ను ఎడిట్స్ యాప్ ద్వారా దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంపిక చేసిన మార్కెట్లలోనే కొంతమందికి అందుబాటులో ఉండొచ్చు. అకౌంట్, ప్రాంతం, యాప్ వెర్షన్‌ను బట్టి లభ్యత మారవచ్చు. కొన్ని వాడక పరిమితులు కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి, రీల్స్ ద్వారా ఎదగాలనుకునే చిన్న క్రియేటర్లు, వ్యాపారాలకు ఈ ఫీచర్ ఉపయోగపడొచ్చు. అయితే దీని సలహాలు నిజంగా ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో వాడిన తర్వాతే తెలుస్తుంది.
Also Read: పండుగ ఆఫర్ల పేరుతో భారీ సైబర్ మోసాలు.. ఆన్‌లైన్ షాపింగ్‌లో సేఫ్‌గా ఉండండిలా!