UPI in Post Offices: నేటి కాలంలో ఎక్కడికి వెళ్లినా ఫోన్ తోనే పని.. డబ్బులు ఎవరు వెంట తీసుకెళ్లడం లేదు. ఫోన్‌తో స్కాన్ చేసి డబ్బులు చెల్లించడం అలవాటు అయిపోయింది. ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు ఫోన్లలోనే స్కాన్ చేసే డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ పోస్టాఫీసుల్లో అలా కుదిరేది కాదు. తప్పనిసరిగా నగదు మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో, ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు.. భారత పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 32 ప్రధాన, 689 సబ్, 5,006 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై వినియోగదారులు.. తమ మొబైల్ ఫోన్ ఉపయోగించి స్కాన్ చేసి.. కేవలం కొన్ని సెకన్లలో చెల్లింపులు చేయవచ్చు. ఇక పొత్తికాగితాలు, క్యూలైన్లు, నిలబడాల్సిన అవసరం లేదు. ఈ సేవలను ఆగస్టు నెల నుండి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని పోస్టల్ శాఖ యోచిస్తోంది.
పాత విధానాల నుంచి ఆధునికీకరణ వైపు
పోస్టాఫీసులు గతంలో నుంచి సామాన్య ప్రజలకు.. నిత్యసేవల కేంద్రంగా నిలిచాయి. అయితే నగదు వినియోగం ఆధారిత వ్యవస్థ వల్ల.. చాలామంది సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. నగదు చెల్లింపులలో జాప్యం, చిల్లర కొరత, సెక్యూరిటీ సమస్యలు లాంటి వాటితో అధికారులు, కస్టమర్లు ఇబ్బందులు పడేవాళ్లు. ఇప్పుడు యూపీఐ చెల్లింపులతో ఆ సమస్యలకు చెక్ పడనుంది.
భవిష్యత్ పోస్ట్ ఆఫీసు.. టెక్నాలజీతో ముందుకు
ఈ నిర్ణయం కేవలం చెల్లింపులు సులభతరం చేయడమే కాకుండా, పోస్టాఫీసులను ఆధునికీకరించడానికి తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు. చిన్న గ్రామాల్లో కూడా ప్రజలు డిజిటల్ చెల్లింపులపై.. అవగాహన కలిగి ఉండేలా చేయడం, వారి బ్యాంకింగ్ సామర్థ్యాన్ని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
ప్రజల స్పందన: సంతోషం వ్యక్తం
ఇప్పటికే ఈ సేవలు పోస్టాఫీసుల్లో అందుబాటులోకి రావడంతో.. ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం నగదు తీయడానికి ఎటువంటి ఎటిఎం వెతికేవాళ్లం. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులోనే యూపీఐ అందుబాటులో ఉండటంతో.. చాలా సౌకర్యంగా ఉందని పలువురు చెబుతున్నారు.
Also Read: స్మార్ట్ పోన్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్.. ఆ ఐదు ఫీచర్స్ తెలుసా? అయితే ఇదిగో..
ఈ నిర్ణయం వల్ల పోస్టాఫీసులు కేవలం లెటర్లు పంపే కేంద్రాలుగా కాకుండా, ఆధునిక ఫైనాన్షియల్ సర్వీస్ హబ్‌లుగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపుల విస్తరణకు.. ఇది ప్రోత్సాహకంగా మారనుంది.