Gold Production: బంగారం కొండెక్కి కూర్చొంది. తులం మార్కెట్లో లక్షా 25 వేల పైమాటే. ఇప్పట్లో కిందకు దిగొచ్చే పరిస్థితులు లేవని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి ఏపీలో బంగారు ఉత్పత్తి మొదలుకానుంది. ఈ విషయాన్ని డెక్కన్ గోల్డ్ మైన్స్ స్వయంగా వెల్లడించింది. సింపుల్‌గా చెప్పాలంటే కొనుగోలుదారులకు ఇదొక శుభవార్త.
ఏపీలో బంగారం ఉత్పత్తి
మార్కెట్‌లో బంగారు ధరలు రోజురోజుకూ పెరిగిపోతోంది. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాలతో మదుపరులు గోల్డ్ పై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారంతోపాటు వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం మార్కెట్‌లో తులం బంగారు లక్షా 25 వేలు పైనే పలుకుతోంది. ఇంకా పెరుగుతోందని, దిగిరావడం కష్టమని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో డెక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ శుభవార్త చెప్పింది. నవంబర్ నుంచి కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్‌లో ఉత్పత్తి మొదలు పెడుతున్నట్లు ఆ కంపెనీ ప్రకటన చేసింది. తుగ్గలి మండలం బొల్లవానిపల్లి గ్రామం సమీపంలో నిర్మించిన పరిశ్రమ నుంచి శుద్ధి ప్రక్రియ మొదలవుతుందని అందులోని సారాంశం.
వచ్చేనెల నుంచి జొన్నగిరి బంగారం
దేశంలో ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫస్ట్ బంగారు గని ఇదే. పూర్తి స్థాయిలో పని చేస్తే ఏడాదికి 500 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలన్నది ఆ కంపెనీ మాట. భవిష్యత్తులో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కొత్తగా నిర్మించిన ప్లాంట్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. స్థానిక యువత, భూములిచ్చిన రైతులకు అందులో ఉద్యోగాలు ఇస్తున్నట్లు పేర్కొంది.
ఏపీ గోల్డ్ మైన్స్ బంగారం అందుబాటులోకి వస్తే మార్కెట్లో ధరలు తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. మనకంటే ఎక్కువగా చైనా బంగారం దిగుమతి చేసుకుంటోంది. ఏపీలో ఉత్పత్తి చేసిన బంగారాన్ని ఇక్కడి మార్కెట్ అవసరాలను తీర్చడం ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు.
ALSO READ: పసిడి కొనాలంటే వణికిపోతున్న ప్రజలు
ఏపీలో బంగారు ఉత్పత్తి అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయని సగటు మానవులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పెరిగిన ధర నేపథ్యంలో బంగారం షాపుల వైపు చూడడం మానేశారు. ఒకప్పుడు శుభకార్యాలకు, పండుగలకు బంగారాన్ని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. మరి జొన్నగిరి బంగారం సామాన్యులకు అందుబాటులోకి వస్తుందా? లేక కొండెక్కి కూర్చుకుంటుందా? అనేది చూడాలి.