Cough Syrup Warning| చిన్నపిల్లలు జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతుంటే చాలా మంది తల్లిదండ్రులు వెంటనే కఫ్ సిరప్ ఇస్తారు. ఇది సాధారణ విషయమైపోయింది. వర్షాకాలం, చలికాలంలో వాతావరణంలో మార్పులు, ఇన్‌ఫెక్షన్ల కారణంగా జలుబు, దగ్గు కేసులు ఎక్కువగా కనిపిస్తాయి.
చిన్నపిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువ. అయితే చాలామంది దగ్గు, జలుబు చేయగానే వెంటనే మందులషాపుకి వెళ్లి కఫ్ సిరప్ తీసుకుంటారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఇప్పుడు అలా చేయకూడదని హెచ్చరికలు జారీ చేశాయి. కఫ్ సిరప్‌లు చిన్న పిల్లలకు ఇవ్వకూడదని అవి అనవసరమే కాకుండా, ఆరోగ్యానికి హాని కలిగించే ఆవకాశం ఉందని ప్రకటించాయి.
ప్రముఖ ఆరోగ్య సంస్థలు అన్నీ ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ పిల్లలకు కఫ్ సిరప్‌ల ఇవ్వకూడదని చెప్పాయి. “చాలా మంది పిల్లలలో దగ్గు సమస్య ఏ మందులు లేకుండా కేవలం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అదే తగ్గిపోతుంది” అని వైద్యులు తల్లిదంత్రులకు సూచిస్తున్నారు. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, బ్రిటన్ కు చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ నేషనల్ హెల్త్ సర్వీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
మందులకు బదులుగా, ఇంట్లో సహజ చికిత్సలు ఉపయోగించడం మంచిది. మీ పిల్లవాడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే.. సాలైన్ నాజల్ డ్రాప్స్ ముక్కులో వేయండి. గాలి పొడిగా ఉంటే ఇంట్లో హ్యూమిడిఫైయర్ ఉపయోగించండి.
ఒక సంవత్సరం పైబడిన పిల్లలు దగ్గుతో బాధపడుతుంటే వారికి తేనె ఇవ్వడం సురక్షితమే. జలుబు, దగ్గు సమస్యలను తేనె ప్రభావవంతమైన ఔషధం. మీ పిల్లవాడికి సగం టీస్పూన్ తేనె ఇవ్వవచ్చు. గొంతులో అడ్డంకిగా ఉన్న కఫాన్ని ఇది తగ్గిస్తుంది. అయితే, పన్నెండు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులకు తేనె ఇవ్వకూడదని వైద్యులు చెబుతున్నారు.
కఫ్ సిరప్‌కు వయస్సు పరిమితి
యునైటెడ్ కింగ్‌డమ్ ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ ఓవర్-ది-కౌంటర్ (డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా) సిరప్‌ల ను నిషేధించింది. యునైటెడ్ స్టేట్స్‌లో రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వాటి ఉపయోగానికి వ్యతిరేకంగా సిఫారసు చేయబడింది. ఇండియాలో, పిల్లలు ఆరు సంవత్సరాలు దాటే వరకు పీడియాట్రిషియన్లు ఈ ఉత్పత్తుల ఉపయోగాన్ని నిరుత్సాహపరుస్తారు.
జోటా హెల్త్ కేర్ కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ సుజీత్ పౌల్ ప్రకారం.. కఫ్ సిరప్ ని వైద్యుడి సూచన ప్రకారమే తీసుకోవాలి. స్వీయ వైద్యం చాలా ప్రమాదకరం. పిల్లలకు ఎంత మోతాదు ఇవ్వాలో తెలియక పిల్లలకు ప్రాణాపాయం పరిస్థితి రావొచ్చని హెచ్చిరించారు. ఉదాహరణకు వారికి గుండె, శ్వాస వంటి తీవ్ర సమస్యలు కలుగవచ్చు. సిరప్ ను మరొక రకమైన మందుతో కలిపి ఉపయోగించడం వలన రియాక్షన్ కూడా జరగవచ్చు.
Also Read: యవ్వనంలోనే ముసలితనం ఛాయలు.. దేశంలో పెరుగుతున్న సమస్య.. ధృడమైన శరీరం కోసం ఈ టిప్స్