UPI Payments: మనలో చాలామంది రోజువారీ ఖర్చుల కోసం చిన్న చాక్లెట్ నుంచి కూరగాయల వరకు ప్రతీదానికి ఫోన్ పే, గూగుల్ పే లేదా పేటీఎంల ద్వారానే యూపీఐ పేమెంట్స్ చేస్తుంటాం. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా మొబైల్ ఉంటే చాలు క్షణాల్లో లావాదేవీలు అయిపోవడంతో డిజిటల్ పేమెంట్స్ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే గత కొంతకాలంగా యూపీఐ పేమెంట్స్‌పై కూడా బ్యాంకులు ఫీజులు వసూలు చేస్తాయనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో సామాన్య ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై స్పష్టతనిస్తూ ఒక కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రూ.2 వేల వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించకూడదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. బ్యాంకులు కానీ, పేమెంట్ గేట్‌వేలు అందించే సంస్థలు కానీ ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందే. కేవలం యూపీఐ మాత్రమే కాకుండా రుపే డెబిట్ కార్డ్ ద్వారా జరిగే పేమెంట్స్‌కు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది.
కొద్ది రోజుల కిందట పార్లమెంటులో ఆమోదం పొందిన ఒక కొత్త బిల్లు కారణంగా యూపీఐ ఫ్రీ సర్వీస్ కట్ అవుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్‌కు ఇచ్చే చట్టపరమైన రక్షణ విధానాన్ని మార్చడంతో ఇకపై అందరూ ఛార్జీలు కట్టాల్సి వస్తుందని అందరూ భావించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో ప్రజలు కాస్త కంగారు పడ్డారు. కానీ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇది కేవలం ఒక టెక్నికల్ మార్పు మాత్రమేనని, కన్జూమర్లపై ఎలాంటి భారం పడదని అప్పుడే క్లారిటీ ఇచ్చారు.
Also Read: DSLR కెమెరాలకు గట్టిపోటీ ఇవ్వనున్న iQOO 16.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే!
చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఇదే. రూ.2 వేలకు పైన జరిగే లావాదేవీల పరిస్థితి ఏంటి? అని టెన్షన్ పడుతుంటారు. ఇక్కడే ప్రభుత్వం ఒక చిన్న ట్విస్ట్ పెట్టింది. రూ.2 వేల లోపు ట్రాన్సాక్షన్స్‌కు ఎలాంటి ఛార్జీలు ఉండవని ఖరారు చేసినప్పటికీ.. అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న పెద్ద లావాదేవీల విషయంలో మాత్రం భవిష్యత్తులో కొన్ని మర్చెంట్ ఛార్జీలు (ఎండీఆర్) వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ ఛార్జీలు ఒకవేళ వచ్చినా అవి మనలాంటి యూజర్లపై కాకుండా నేరుగా దుకాణదారులు లేదా పెద్ద వ్యాపారులపై మాత్రమే పడేలా చూస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
మనం మన ఫ్రెండ్స్‌కు, కుటుంబ సభ్యులకు పంపే పీటుపీ (పర్సన్ టూ పర్సన్) మనీ ట్రాన్స్‌ఫర్స్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండే ప్రసక్తే లేదు. ఈ నిబంధన పూర్తిగా సేఫ్ జోన్‌లో ఉంది. కేవలం పెద్ద పెద్ద బిజినెస్ మర్చెంట్లకు జరిగే పేమెంట్స్ విషయంలో మాత్రమే భవిష్యత్తులో వేరే నిబంధనలు రావచ్చు కానీ, రోజువారీ మన అవసరాలకు వాడే యూపీఐ మాత్రం యథావిధిగా ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా కొనసాగుతుంది.
ప్రపంచంలోనే అత్యధిక రిటైల్ ఫాస్ట్ పేమెంట్స్ జరుగుతున్న దేశాల్లో మన భారతదేశం ఎప్పుడో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. గ్లోబల్ సంస్థల నివేదికల ప్రకారం.. ఒక్క ఆగస్టు నెలలోనే మన దేశంలో దాదాపు 24.51 బిలియన్ల లావాదేవీలు జరిగాయంటే డిజిటల్ ఇండియా ఏ స్థాయిలో దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యాప్‌ల ద్వారానే సింహభాగం లావాదేవీలు జరుగుతున్నాయి. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా డిజిటల్ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించాలన్న ప్రభుత్వ తాజా నిర్ణయం నిజంగా డిజిటల్ యూజర్లకు ఊరటనిచ్చే విషయమే.
Also Read: ఒప్పో ఫైండ్ N6 vs మోటరోలా రేజర్ ఫోల్డ్.. ఈ రెండింటిలో ఫీచర్లు, కెమెరా, డిజైన్ పరంగా ఏది బెటర్?