వాడేసిన వంట నూనెతో విమానాలు నడుపుతారంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజమే. ఇన్నాళ్లూ విమానాలు నడపడానికి వేరే ఇంధనం ఉంటుందని, దాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) అంటారని మీకు తెలిసే ఉంటుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయమే మన వంటనూనే, అదేనండీ వాడేసిన వంటనూనె. విమానాలు నడపడానికి ఉపయోగించే ATF కి ప్రత్యామ్నాయంగా ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) ని ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడేసిన వంట నూనెలతో తయారు చేయడమే ఇక్కడ విశేషం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు 35వేల టన్నుల SAF ని తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం వారు వాడేసిన వంట నూనెల్ని సేకరిస్తున్నారు.
తక్కువగా చూడొద్దు..
ఇప్పటి వరకూ మనం వాడేసిన వంట నూనె అంటేనే భయపడి పోయేవాళ్లం. పదే పదే అదే వంటనూనెను వేడి చేస్తే దానివల్ల క్యాన్సర్ వస్తుందనే భయం ఉంది. రోడ్డుపక్క కాకా హోటళ్లలో అదే వంట నూనెను పదే పదే వేడిచేస్తూ వాడుతుంటారు. మనం చూడలేం కాబట్టి పెద్ద పెద్ద హోటళ్లలో కూడా ఇదే తంతు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే క్యాన్సర్ ని కలిగించే ఆ వంటనూనే విమానం నడపడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మనం సాధారణ పెట్రోల్ లో ఇథనాల్ ని కలుపుతున్నాం కదా, అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ని కూడా కలుపుతారట. అలా కలిపే మిశ్రమంలో భారీగా మార్పులు వచ్చేస్తే సస్టైనబుల్ ఫ్యూయల్, ఏవియేషన్ ఫ్యూయల్ కి ప్రత్యామ్నాయంగా మారుతుంది.
అంత సులభమా..?
2027 నుంచి అంతర్జాతీయ విమానయాన సంస్థలు, తాము వినియోగించే విమాన ఇంధనంలో 1 శాతం SAFను కలపడాన్ని భారత్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలోనే SAF తయారీకోసం హర్యానాలోని ఐఓసీ పానిపట్ రిఫైనరీ సిద్ధమవుతోంది. దీనికి అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ సంస్థ ఐఎస్‌సీసీ కార్సియా సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. దేశంలో ఈ సర్టిఫికేషన్ పొందిన ఏకైక సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే. ఈ సంస్థ ఈ ఏడాది డిసెంబర్ నాటికి 35వేల టన్నుల SAF ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లో 1 శాతం సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ కలిపేందుకు ఈ ఉత్పత్తి సరిపోతుందనమాట. వాస్తవానికి 50శాతం వరకు ఈ SAF ని ATFలో కలిపి వాడుకునే వీలుంది.
ఎలా సేకరిస్తారంటే..?
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ వాడేసిన వంట నూనెకోసం పెద్ద కసరత్తే చేసింది. ఆల్రడీ పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ తో టైఅప్ పెట్టుకుంది. ఐటీసీ హోటళ్లు, హల్దీరామ్ వంటి కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకుంది. వాటి ద్వారా వాడేసిన వంట నూనెల్ని ఐఓసీ సేకరిస్తుంది. అలా సేకరించిన దాన్ని SAF ఉత్పత్తికోసం ఉపయోగిస్తుంది. 2070 నాటికి జీరో ఎమిషన్స్ ని టార్గెట్ గా పెట్టుకున్న భారత్, ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఆల్రడీ పెట్రోల్ లో ఇథనాల్ కలుపుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి పెట్రోల్ లో 20శాతం ఇథనాల్ కలిపే దిశగా అడుగులు పడుతున్నాయి. విమాన ఇంధనాల్లో కూడా ఇంతే త్వరగా సంచలన మార్పులు వస్తాయని అంటున్నారు.