
Video games : పిల్లలే కాదు.. పెద్దలు కూడా వీడియో గేమ్స్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. గేమింగ్ కన్సోల్స్, కంప్యూటర్లు, ఆఖరికి మొబైల్ ఫోన్ల ద్వారా వీడియో గేమ్‌లు తెగ ఆడేస్తున్నారు. కొవిడ్ సమయంలో ఇంటి పట్టునే ఉండాల్సి రావడంతో అందరిలోనూ వీడియో గేమ్‌లపై ఆదరణ లభించింది. ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది.
పెద్దల్లో వీడియో గేమ్స్ కు ఎంత ఆదరణ ఉందన్న విషయంపై 56 దేశాల్లో ఓ శాంపిల్ సర్వే నిర్వహించారు. అడపాదడపా వీడియో గేమ్‌లు ఆడినట్టు రెస్పాండెంట్లలో 92% శాతం చెప్పారు. వీరంతా మొబైల్ గేమింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. తక్కువ ఖర్చుకే గేమింగ్ యాక్సెస్ సులభంగా లభించడం ఇందుకు ఓ కారణం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
భారత్ సహా తుర్కియే, నైజీరియా, చైనా దేశాల్లో పెద్దలు అధిక సంఖ్యలో వీడియో గేమ్‌లపై మోజు పెంచుకున్నారు. ఈ విషయంలో తుర్కియే అగ్రభాగాన ఉన్నట్టు సర్వేలో తేలింది. 80% మంది స్మార్ట్ ఫోన్లలో గేమ్‌లు ఆడినట్టు వెల్లడించారు.
దక్షిణాఫ్రికాలో 76%, ఇండియాలో 77%, నైజీరియాలో 84% మంది పెద్దలు వీడియో గేమ్‌లంటే ఆసక్తి పెంచుకున్నారు. థాయ్ లాండ్(80%), చైనా(72%), పెరూ(67%)లో వీడియో గేమ్‌లు ఆడే పెద్దల సంఖ్య ఎక్కువే. ఇక అమెరికా(57%), స్వీడన్(41%), జపాన్(40) దేశాల్లో వీడియో గేమ్ లపై మక్కువ ఉన్న పెద్దల సంఖ్య ఓ మోస్తరుగా ఉంది. ఫిలిప్పీన్స్, ఇండొనేసియా దేశాల్లో పెద్దలూ అంతే.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలోనూ గేమర్లు ఎక్కువే. సౌదీలోని పెద్దల్లో తరచుగా వీడియో గేమ్‌లు ఆడేవారు 33%గా ఉన్నారు. తుర్కియే, ఈజిప్టు, థాయ్‌లాండ్, చైనా దేశాల్లో గేమింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ. వీడియో గేమ్‌లకు ప్రసిద్ధి చెందిన జపాన్‌లో మాత్రం పెద్దలు వాటిపై అంతగా ఆసక్తి చూపడం లేదు.
అమెరికాలో పెద్దలైతే వీడియో గేమ్‌లు ఆడేందుకు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల కంటే కన్సోల్స్‌కే మొగ్గు చూపుతున్నారు. మెక్సికో, లాటిన్ అమెరికా, యూరోపియన్ దేశాల్లో కన్సోల్స్ ఆధారంగా గేమ్‌లు ఆడటం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే చాలా ఎక్కువ.