Vodafone Idea 5G Rollout Plans: భారతీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా(VI) త్వరలో 5G సేవలను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నది. మార్చి చివరి నాటికి దేశ వ్యాప్తంగా సుమారు 75 నగరల్లో 5G బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించాలని నిర్ణయించింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ కు పోటీగా తన కస్టమర్లకు 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. మెరుగైన నెట్ వర్క్ తో పాటు తక్కువ ధరలో 5G సర్వీసులను అందించాలని ప్రయత్నిస్తున్నది.
ఆలస్యంగా 5G సేవలు ప్రారంభం
గతంలో దేశ వ్యాపంగా టెలికాం రంగంలో త్రిముఖ పోరు కొనసాగింది. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా పోటా పోటీగా తమ సర్వీసులను అందించాయి. అయితే, 5G సర్వీసులను అందించడంలో జియో, ఎయిర్ టెల్ తో పోటీ పడలేకపోయింది వొడాఫోన్ ఐడియా. 5జీ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సర్వీసులను అందించలేకపోయింది. మరోవైపు పోటీ సంస్థలు అయిన జియో, ఎయిర్ టెల్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా 5G సేవలను విస్తరించాయి. కాస్త ఆలస్యం అయినా, వినియోగదారులకు 5G సర్వీసులను అందివ్వాలని నిర్ణయించింది. మార్కెట్లో మళ్లీ తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నది.
మరింత చౌకగా 5G ప్లాన్లు
ఎప్పుడు వచ్చామన్నది కాదు.. అన్నట్లుగా ఎయిర్ టెల్, జియోతో పోలిస్తే ఎంట్రీ లెవల్ ప్లాన్లను మరింత చౌకగా అందుబాటులోకి తేబోతున్నట్లు తెలుస్తున్నది. సుమారు 15 శాతం ధరలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రీపెయిడ్ యూజర్లను ఆకర్షించేందుకు డీలర్ కమీషన్లు, అడ్వటైజ్ మెంట్ ఖర్చుల్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. తొలుత 75 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించి, నెమ్మదిగా దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నది.
గత ఏడాది 46 వేల టవర్ల ఏర్పాటు
ఇక వొడాఫోన్ ఐడియా 2024లో ఏకంగా 46,000 పైగా కొత్త టవర్లను ఏర్పాటు చేసింది. 58,000 కంటే ఎక్కువ సైట్లలో తన సామర్థ్యాన్ని విస్తరించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన కవరేజ్, బ్రౌజింగ్ అనుభవాన్ని అందించే అవకాశం ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. వొడాఫోన్ ఐడియా కంపెనీతో పోల్చితే జియో, ఎయిర్ టెల్ సంస్థలు 2024 ప్రారంభంలోనే దేశవ్యాప్తంగా 5G నెట్ వర్క్ ను విస్తారించాయి. సెప్టెంబర్ 2024 త్రైమాసికం చివరి నాటికి, జియో 148 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉండగా, ఎయిర్‌టెల్ 105 మిలియన్ల 5G సబ్ స్క్రైబర్ లను కలిగి ఉంది.
ఇంకా 4G సేవలే అందిస్తున్న వోడాఫోన్ ఐడియా
ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా 4G సేవలను అందిస్తున్నది. గత వారం వార్షిక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వినియోగదారులకు అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం వరకు అపరిమిత డేటాను అందిస్తోంది. ఇందుకోసం రూ.3,599, రూ.3,699, రూ.3,799 ప్రీ- పెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి ఏడాది పొడవునా ప్రతిరోజూ పొద్దున 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అపరిమిత డేటా వినియోగాన్ని అందిస్తున్నాయి.
Read Also: జియో పేరుతో కొత్త స్కామ్, అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు!