WhatsApp About Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారుల కోసం మరో సరికొత్త అప్‌డేట్‌ను పరిచయం చేసింది. యూజర్లు తమ కాంటాక్ట్స్‌తో మరింత సులభంగా కనెక్ట్ అవ్వడానికి వీలుగా ‘About’ (అబౌట్) ఫీచర్‌ను సరికొత్తగా రీడిజైన్ చేసింది. ఇప్పటివరకు ఎవరిదైనా ప్రొఫైల్ వివరాలు లేదా ‘అబౌట్’ స్టేటస్ చూడాలంటే వారి ప్రొఫైల్ లోపలికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త అప్‌డేట్ వల్ల, ఇకపై నేరుగా చాట్ స్క్రీన్ నుంచే అవతలి వ్యక్తి అబౌట్ స్టేటస్‌ను సులభంగా చూడవచ్చు. అంతేకాదు, దానికి అక్కడికక్కడే రిప్లై కూడా ఇచ్చే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది.
Read also-వేసవిలో పూల్ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారా? కళ్లకు ఇన్‌ఫెక్షన్ ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఈ కొత్త మార్పు ద్వారా మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారనే సమాచారం సులభంగా అందుతుంది. మీరు మీటింగ్‌లో ఉన్నారా, డ్రైవింగ్‌లో ఉన్నారా లేదా ఖాళీగా ఉన్నారా అనే విషయాలను ఇతరులు చాట్ ఓపెన్ చేయగానే తెలుసుకోవచ్చు. మీ ప్రస్తుత మానసిక స్థితిని లేదా ఆలోచనలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఇతరులతో పంచుకోవచ్చు.
ఈ ఫీచర్‌లో యూజర్ల భద్రతకు వాట్సాప్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మీ ప్రొఫైల్ సమాచారాన్ని ఎవరెవరు చూడవచ్చో మీరే నిర్ణయించుకోవచ్చు. వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్లి, మీ ‘About’ స్టేటస్ అందరికీ కనిపించాలా, కేవలం మీ కాంటాక్ట్స్‌కు మాత్రమే కనిపించాలా లేదా ఎవరికీ కనిపించకూడదా అనేది మీరే నియంత్రించవచ్చు.
మీ అబౌట్ స్టేటస్‌ను అప్‌డేట్ చేయడం చాలా సులభం.
మొదట వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లండి.
మీ ప్రొఫైల్ పిక్చర్ పై కనిపిస్తున్న చిన్న బబుల్ గుర్తుపై టాప్ చేయండి.
అక్కడ మీ ప్రస్తుత స్థితిని లేదా మూడ్‌ను టైప్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు.
ఈ చిన్న మార్పు చాటింగ్ అనుభవాన్ని మరింత వేగవంతం చేస్తుంది. అవతలి వ్యక్తి బిజీగా ఉన్నారో లేదో ముందే తెలుసుకుని మెసేజ్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సరికొత్త ఫీచర్‌ను పొందడానికి మీ వాట్సాప్ యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోండి.