Blue Hole:- ఒకప్పుడు ఇవన్నీ మిస్టరీలు అనిపించిన విషయాలపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ వాటి వెనుక కథను బయటపెడుతున్నారు. అలాంటి మిస్టరీలలో బ్లాక్ హోల్స్, బ్లూ హోల్స్ కూడా భాగమే. స్పేస్ టెక్నాలజీ అనేది పెరిగిన తర్వాత బ్లాక్ హోల్స్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు మెరుగుపడ్డాయి. కానీ అదే రేంజ్‌లో డీప్ సీ టెక్నాలజీ అనేది ఇంకా అభివృద్ధి చెందలేదు. అయినా కూడా ప్రపంచంలోని రెండో బ్లూ హోల్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.
మెక్సికోలోని యాకాటాన్ పెనిన్సులాలో రెండో అతిపెద్ద బ్లూ హోల్‌ను శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఏడేళ్ల క్రితం సౌత్ చైనా సముద్రంలో ముందుగా అతిపెద్ద బ్లూ హోల్‌ను వారు కనిపెట్టారు. అయితే దానికంటే ఇది దాదాపు 80 అడుగులు తక్కువ లోతు ఉందని వారు చెప్తున్నారు. మెక్సికోలో తాజాగా కనుగొన్న బ్లూ హోల్ లోతు 900 అడుగులు ఉందని శాస్త్రవేత్తల ప్రాథమిక పరిశోధనల్లో తేలింది. బ్లూ హోల్స్ అనేవి ఉంటాయని శాస్త్రవేత్తలకు ఐడియా ఉన్నా.. 2021 నుండి దీనిపై పరిశోధనలు వేగవంతం అయ్యాయి.
అసలు బ్లూ హోల్స్ అనేవి ఏంటి అని ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సముద్రంలోని తీర ప్రాంతాల్లో గుహల్లాగా ఏర్పడే వాటినే బ్లూ హోల్స్ అంటారని వారు తెలిపారు. ఆ బ్లూ హోల్స్‌లోనే ఎన్నో రకాల సముద్ర జీవులు, మొక్కలు పెరుగుతాయని అన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ అనేది ఎంత అభివృద్ధి చెందినా.. బ్లూ హోల్స్‌ను అందుకోవడానికి మాత్రం చాలావరకు శాస్త్రవేత్తలకు ఎలాంటి టెక్నాలజీ సాయం చేయలేదు.
బ్లూ హోల్స్‌లో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అయినా కూడా తక్కువ ఆక్సిజన్‌తోనే జీవనాన్ని కొనసాగించే ఎన్నో ప్రాణులకు బ్లూ హోల్స్ నివాసాలుగా మారుతాయని అన్నారు. 2021లో మెక్సికోలోని సముద్రంలో ఒక బ్లూ హోల్ ఉందని శాస్త్రవేత్తలకు తెలిసింది. అప్పటినుండి పరిశోధనలు చేపడితే.. ఇన్నాళ్లకు దీని గురించి వారి పలు వివరాలు తెలిసాయి. కానీ ఇంకా దీనిపై పూర్తిస్థాయిలో స్టడీ నిర్వహించాలని శాస్త్రవేత్తలు తెలిపారు.