Zomato Food Rescue Feature : రోజూ లక్షలాదిమందికి ఫుడ్ అందించే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. తాజాగా వినూత్న ఆలోచనతో తన ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టింది. సరికొత్త ఫీచర్ ను లాంఛ్ చేస్తూ ఆహారం వృధా కాకుండా చూడటమే తమ లక్ష్యమని తెలిపింది.
నిత్యం లక్షలాదిమందికి సరైన సమయంలోనే ఆహారాన్ని అందిస్తూ వేలాది మంది ఉపాధి కల్పిస్తున్న ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో. ఇప్పటికే తన సేవలను మరింత విస్తృతం చేసిన ఈ సంస్థ తాజాగా మరో మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చింది. ఆహారం వృథా కాకుండా చూడటమే తమ లక్ష్యమని తెలుపుతూ ఓ సరి కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీంతో జొమాటో యూజర్స్ కు అతి తక్కువ ధరకే ఆహారం లభించే అవకాశం కల్పించింది. కాకపోతే జొమాటోలో బుకింగ్స్ మాత్రం నిమిషాల్లో జరిగితేనే ఈ అవకాశం దక్కుతుందని తెలిపింది.
జొమాటో తాజాగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే… నిజానికి జోమాటోలో నెలకు సుమారు నాలుగు లక్షల ఫుడ్ ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో చెప్పలేనంత భారీ స్థాయిలో ఆహారం వృథా అవుతున్న మాట నిజమే. ఈ వృథాను అరికట్టేందుకే ఫుడ్ రెస్కూ (Zomato launched Food Rescue Feature) పేరుతో అదిరిపోయే ఫీచర్ ను జొమాటో తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఫుడ్ వృథా కాకుండా అరికడుతుందని తెలిపిన జొమాటో సహవ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ ట్విట్టర్ వేదికగా ఈ ఫీచర్ అప్డేట్స్ గురించి వెల్లడించారు.
ALSO READ : ఒప్పో టైమ్ ఆగయా.. Find X8, Find X8 Pro ఇండియా లాంఛ్ డేట్ ఫిక్స్
ఇక ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే ఆ ఆర్డర్ ను తీసుకెళ్తున్న డెలివరీ పార్ట్నర్ కు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర కస్టమర్స్ కు నోటిఫికేషన్ వెళుతుంది. తక్కువ ధరకే ఫుడ్ అందుబాటులో ఉందనే విషయం వారి యాప్ లో కనిపించడంతో కావాల్సిన కస్టమర్స్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే ఈ ఆప్షన్ జొమాటోలో కాస్త సమయం మాత్రమే ఉంటుందని తెలిపిన గోయల్.. తక్కువ సమయంలోనే అవసరమైన కస్టమర్ కు ఫుడ్ డెలివరీ చేసే అవకాశం ఉందని.. ఆ ఆర్డర్ పై వచ్చిన మొత్తాన్ని పాత కష్టమర్ తో సహా రెస్టారెంట్ పార్ట్నర్ కు చెల్లిస్తామని ఇందులో జొమాటో ఎటువంటి చార్జీలు వసూలు చేయదని తెలిపారు. అయితే షేక్స్, స్మూతీస్, ఐస్ క్రీమ్ తో పాటు మరికొన్ని ఆర్డర్స్ కు ఈ ఆఫర్ వర్తించదని… డెలివరీ పార్ట్నర్ కు ఆర్డర్ పికప్ నుంచి చివరి డెలివరీ వరకు నగదు మాత్రం అందిస్తామని తెలిపారు. ఈ ఫీచర్ కోసం గోయల్ ట్విట్టర్ వేదికగా తెలుపగా మంచి స్పందన వచ్చింది.
జొమాటో ఇప్పటికే ఫుడ్ క్యాన్సిల్స్ పైన కఠినమైన చర్యలను అమలు చేస్తూనే ఉంది. నో రిఫండ్ పాలసీతో పాటు అదనపు ఛార్జీలు సైతం వసూలు చేస్తున్నప్పటికీ ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయని గోయల్ వెల్లడించడంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ యాప్ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని.. ఆహారం వృథా కాకుండా ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.