
Babar Azam : ఆఫ్గనిస్తాన్ పై ఓటమితో పాకిస్తాన్ జట్టు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. ఇంటా బయట కూడా ఒత్తిళ్ల మధ్య నలిగిపోయింది. నిజానికి పాక్ జట్టు కూడా అవమానంతో కక్కలేక మింగలేక నలిగిపోయింది. వాళ్లే అంత బాధలో ఉంటే ఇక మాజీలు, సీనియర్లు, ప్రజలు అందరూ దాడి చేసేసరికి వారు బయట ప్రపంచానికి ముఖం చూపించలేక సతమతమయ్యారు. వసీం అక్రమ్ లాంటివారు తిండి దండగ అన్నట్టు పరుష పదజాలంతో మాట్లాడటం వివాదాస్పదమైంది.
ఈ సమయంలో బాబర్ అజామ్ కన్నీళ్లు పెట్టుకున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో పాకిస్తాన్ సీనియర్ లెజండరీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ బాబర్ కి అండగా నిలిచాడు. తను బ్యాట్స్ మెన్ గానే కాదు, బౌలర్ గా కూడా పాకిస్తాన్ కి ఎన్నో విజయాలు అందించాడు. టెస్ట్ ల్లో 24, వన్డేల్లో 14 సెంచరీలు చేశాడు. అంతేకాదు ఇండియన్ ఐపీఎల్ లో ఆడాడు.
నిజానికి 2023 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు అన్నిరంగాల్లో వైఫల్యం చెందిందని యూసఫ్ అన్నాడు. అటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్, ఇంకా చెప్పాలంటే బ్యాటింగ్ లో ఇలా అన్నింటా వైఫల్యాల వల్లే ఓటమి పాలైంది గానీ, ఒక్క కెప్టెన్ బాబర్ వల్ల కాదని సమాధానం ఇచ్చి, అందరి నోళ్లు మూయించాడు. ఇంతవరకు ఇలా ఎవరూ ఆలోచించలేదు. అంతా కెప్టెన్ వైపే వేలెత్తి చూపించారని బాబర్ కి చాలామంది సపోర్ట్ గా నిలుస్తున్నారు.
బాబర్ ఏడ్చిన సంగతి నాకు తెలిసింది కానీ, అదెంతవరకు నిజమో తెలీదు. కానీ ఏడవాల్సిన అవసరం లేదు..ఇలాంటి జట్టునిచ్చి పంపిన మేనేజ్మెంట్ దగ్గర నుంచి అందరూ ఏడవాల్సిన అవసరం ఉందని అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఇలాంటి కష్ట సమయాల్లో బాబర్ ఆజమ్‌కు అండగా ఉంటాం. యావత్ దేశం కూడా అతనితో ఉంది”.. అని ఒక టీవీ షోలో మహ్మద్ యూసఫ్ అభిప్రాయపడ్డారు. దీంతో ప్రస్తుతానికి బాబర్ మీద మాటల దాడులు తగ్గాయి.
ఆఫ్గాన్ మీద ఓటమి అనంతరం బాబర్ చెప్పిన మాటేమిటంటే…భారీ స్కోర్ సాధించి కూడా మ్యాచ్ ని కాపాడుకోలేకపోయామని అన్నాడు. ఇది నిజంగా వైఫల్యమేనని ఒప్పుకున్నాడు.
అయితే అందరూ అంటున్నట్టు ఇంకా పాకిస్తాన్ తలుపులు మూసుకుపోలేదు. ఇంకా ఆడాల్సిన మ్యాచ్ లు నాలుగు ఉన్నాయి. అవి వరుసగా గెలిస్తే సెమీస్ చేరుతుంది. కానీ దుమ్ము దుమారం రేపుతున్న సౌతాఫ్రికాతో గురువారం జరిగే మ్యాచ్ లో గెలిస్తేనే పాక్ రేస్ లో నిలుస్తుంది. ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్…అన్నింటా దుమ్మురేపుతున్న సౌతాఫ్రికాను ఎంతవరకు నిలువరించగలదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరేమో నెదర్లాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయింది కదా…అలాంటి చిత్రమేదైనా జరగొచ్చని అంటున్నారు. ఏదేమైనా ఈసారి మాత్రం పాక్ చావో రేవో అన్నట్టు ఆడతారనడంలో సందేహమే లేదు.