Bracewell new record:- అతని వీరబాదుడు చూసిన క్రికెట్ అభిమానులంతా… వామ్మో, ఏంటి ఇలా కుమ్మేస్తున్నాడని అనుకున్నారు. అంతకుముందే డబుల్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్‌ని కూడా మర్చిపోయి… అతని ఆటలో మైమరచిపోయారు. అతనే మైకేల్ బ్రేస్‌వెల్. కివీస్ 131 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రేస్‌వెల్, విధ్వంసకర ఆటతో జట్టును దాదాపు గెలిపించినంత పని చేశాడు. తన సంచలన ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు చెమటలు పట్టించి… అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో కేవలం 78 బంతులు ఎదుర్కొన్న బ్రేస్‌వెల్… 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో ఏకంగా 140 పరుగులు సాధించాడు. డబుల్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ కూడా అన్ని సిక్సర్లు కొట్టలేదు. భారత జట్టును ఆఖరి ఓవర్ దాకా కంగారు పెట్టిన బ్రేస్‌వెల్… తన సూపర్ సెంచరీతో కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో ఛేజింగ్‌లో ఏడు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి… రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు… బ్రేస్‌వెల్. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన బ్రేస్‌వెల్… అద్భుత సెంచరీ చేశాడు.
ఈ రికార్డు మాత్రమే కాదు… వన్డే క్రికెట్ చరిత్రలో ఏడో వికెట్ కు ఏకంగా 162 పరుగులు జోడించిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు… బ్రేస్‌వెల్. సహచర ఆటగాడు మిచెల్ శాంట్నర్ ఔట్ కావడంతో రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది కానీ… లేకపోతే, భవిష్యత్తులో మరెవరూ అందుకోలేనంత భారీగా భాగస్వామ్యాన్ని నెలకొల్పేవాడు… బ్రేస్‌వెల్. ఇక… లోయార్డర్‌లో ఏడు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి… అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో ఆటగాడిగా… శ్రీలంక ఆల్‌రౌండర్ తిషార పెరీరాతో కలిసి సంయుక్తంగా నిలిచాడు… బ్రేస్‌వెల్.
Follow this link for more updates:- Bigtv