Team India : T20 వరల్డ్ కప్ సూపర్-12లో పాకిస్థాన్ పై భారత్ ఇంతకుముందెన్నడూ లేనంత, చూడనంత థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. అసలు భారత్-పాక్ మధ్య ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ ల్లో ఇదే నెంబర్ వన్ మ్యాచ్ అని చెప్పొచ్చు. అలాంటి మ్యాచ్ లో ఆఖరి ఓవర్ పై సోషల్ మీడియాలో ఇంకా భారీగా రచ్చ జరుగుతోంది. టీమిండియా మోసం చేసి గెలిచిందని… ముందుగా నో బాల్ ఇవ్వని అంపైర్… కోహ్లి అడగ్గానే నో బాల్ ఇచ్చేశాడని… అతని ఒత్తిడి వల్లే అంపైర్ నోబాల్ ఇచ్చాడని… ఇక ఫ్రీ హిట్ లో కోహ్లీ బౌల్డ్ అయితే డెడ్ బాల్ ఇవ్వకుండా 3 బైస్ ఎలా ఇస్తారని పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అక్కసు వెళ్లగక్కుతున్నారు. పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా డెడ్ బాల్ కు బైస్ రూపంలో 3 పరుగులు ఎలా ఇస్తారని ప్రశ్నించాడు. అతనితో పాటు పాక్ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే రిప్లై ఇస్తున్నారు… భారత అభిమానులు, మాజీ అంపైర్లు.
ఆఖరి ఓవర్లో జరిగిన నాటకీయ పరిణామాలపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ అంపైర్ సైమన్ టఫెల్… స్పందించాడు. నో బాల్, డెడ్ బాల్, బైస్ విషయంలో అంపైర్ నిర్ణయాలు సరైనవేనని చెప్పాడు. ఫ్రీ హిట్ బాల్ స్టంప్స్‌ను తాకి థర్డ్‌మ్యాన్ వైపు వెళ్లినపుడు బ్యాటర్లు ఎన్ని పరుగులు తీసినా బైస్ ఇవ్వడం కచ్చితంగా సరైనదేనని అన్నాడు. ఫ్రీ హిట్ సమయంలో బ్యాటర్ బౌల్డ్ అయినా నాటౌట్ కాబట్టి… ఆ బాల్ స్టంప్స్‌ను తాకినా డెడ్‌బాల్‌గా ప్రకటించడానికి వీలే లేదన్నాడు… సైమన్ టఫెల్. నిబంధనల ప్రకారం అంపైర్ బైస్ ఇవ్వడం కరెక్టేనని చెప్పుకొచ్చాడు.
ఇక ఫ్యాన్స్ కూడా షోయబ్ అక్తర్ సహా మరికొందరు ఆటగాళ్లు చేస్తున్న విమర్శలకు… గతాన్ని తవ్విమరీ గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. 17 ఏళ్ల కిందట అడిలైడ్ లో ఆస్ట్రేలియా-ఏ తో జరిగిన మ్యాచ్ లో షోయబ్ అక్తర్ వేసిన ఓవర్ వీడియోను బయటపెట్టి… దీనికేం సమాధానం చెబుతావ్? అంటూ నిలదీస్తున్నారు. షోయబ్ బౌలింగ్ లో ఫ్రీ హిట్ బాల్ కు బౌల్డ్ అయిన బ్యాటర్… బైస్ రూపంలో రెండు పరుగులు తీశాడు. కానీ అప్పుడు షోయబ్ ఎలాంటి అభ్యంతరాలూ లేవనెత్తలేదు. అప్పుడు నిబంధనల ప్రకారం నడుచుకుని… ఇప్పుడు లేనిపోని రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావని షోయబ్ ను ఓ ఆటాడుకుంటున్నారు… భారత అభిమానులు.
ఇక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ నిబంధనల ప్రకారం… బంతి స్టంప్స్‌ను తాకిన తర్వాత అంపైర్లు డెడ్‌బాల్‌గా ప్రకటించే వీలుంటుంది. అయితే ఫ్రీ హిట్ బంతికి ఈ నిబంధన వర్తించదు. కాబట్టి పాక్‌తో మ్యాచ్ సందర్భంగా ఆఖరి ఓవర్లో కోహ్లి, దినేశ్ కార్తీక్ తీసిన 3 పరుగులను అంపైర్ బైస్ రూపంలో ఇవ్వడం కరెక్టే. ఇక బంతిని డెడ్ బాల్‌గా ఎప్పుడు ప్రకటిస్తారంటే… బ్యాటర్ బాల్ ను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాక… బౌలర్ బంతిని విసిరే సమయంలో ఎలాంటి కారణం చేతైనా వికెట్ల మీది బెయిల్స్ కింద పడినట్లయితే… ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణస్తారు. అలాగే బంతి కీపర్ లేదా బౌలర్ చేతికి ఫీల్డర్ ద్వారా అందాక.. అది డెడ్‌బాల్ అయిపోతుంది. ఆ తర్వాత బ్యాటర్లు పరుగులు తీయడానికి వీల్లేదు. తీసినా ఇవ్వరు.