High BP : అధిక రక్తపోటు.. దీన్ని నిశ్శబ్ద కిల్లర్ అని అంటారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే హైబీపీ వస్తుంది. అందుకే చాలా మందికి రక్తపోటు ప్రమాద సూచిక అస్సలు అర్థం కాదు. బీపీ తరచూ పెరుగుతున్నా, తట్టుకోలేనంత కోపం వచ్చినా, మన శరీరంలో తేడాగా అనిపించినా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక లీటర్ రక్తంలో సోడియం లెవల్ 135 నుంచి 145 మిల్లీ ఈక్వెలంట్స్ మధ్య ఉంటుంది. ఎక్కువగా రక్తపోటు ఉన్నవారు రోజువారీ సోడియం 1,500 మిల్లీగ్రాములకు పరిమితం చేయాలి. ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2,400 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అందుకే ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. కారంతో పాటు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటే సోడియం లెవల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆహారంలో సోడియం తగ్గితే రక్తపోటు నార్మల్‌కు వస్తుంది. ఎందుకంటే సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీర అసమతుల్యతతో పాటు ఉబ్బరం వస్తుంది. మన శరీరం ఉప్పును బయటకు పంపేందుకు అదనపు నీటిని నిల్వ చేస్తుంది. ఇది తరచూ శరీరంలో రక్తపోటును ఉత్పన్నం చేస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచేందుకు సహాయపడే ఖనిజంగా పొటాషియం పనిచేస్తుంది. పొటాషియం, సోడియం 2:1 నిష్పత్తిగా ఉంటేనే శరీరంలో రక్తపోటు స్థాయి కరెక్ట్‌గా ఉంటుంది. అరటిపండ్లను తింటే ఎలాంటి సమస్యలు దరిచేరవు. వేరుశెనగ, బియ్యం, గుమ్మడి గింజలు, బాదం, వోట్స్, జీడిపప్పు లాంటివి మెగ్నీషియంకు మంచి వనరులు. మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం నైట్రిక్ ఆక్సైడ్ ధమని గోడల్లో రక్తం సాఫీగా ప్రవహించేలా చేస్తుంది. ఇంట్లో తయారుచేసిన పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కూడా రక్తపోటును తగ్గించవచ్చు. మన ఎముకలు, దంతాలలో భారీ మొత్తంలో కాల్షియం నిల్వ ఉంటుంది. పాల ఉత్పత్తులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాల్షియం రక్త నాళాలు విస్తరించడానికి, సంకోచించడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో జున్ను, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవాలి. 40 ఏళ్ల వయసు దాటిన వారంతా కనీసం వారంలో ఒకసారి సోడియం పరీక్ష చేయించుకోవాలి. ఆహార అలవాట్లను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు ధ్యానం, యోగా చేస్తే అధిక రక్తపోటును నియంత్రించవచ్చు.