Big Stories

ICC Team : ICC టీమ్‌లో కోహ్లీ, సూర్యకు స్థానం

ICC Team : 2022 T20 వరల్డ్ కప్ లో అత్యంత విలువైన ఆటగాళ్ల టీమ్‌ను ప్రకటించింది… ICC. టీమిండియా స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నారు. సూపర్-12 మ్యాచ్ లో పాకిస్థాన్ పై అద్భుతంగా ఆడిన విరాట్‌ కోహ్లీ… 82 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ ను గెలిపించాడు. బంగ్లాదేశ్‌పై 64, నెదర్లాండ్స్‌ పై 62, ఇంగ్లాండ్‌పై 50 పరుగులు చేసి… T20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు… కోహ్లీ. ICC టీమ్ లో 239 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్ కు కూడా చోటు దక్కింది. నెదర్లాండ్స్‌పై 51, దక్షిణాఫ్రికాపై 68, జింబాబ్వేపై 61 పరుగులు చేసి… మూడు అర్థ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు… సూర్య. ఈ వరల్డ్ కప్ లోనే అద్భుతంగా… 189.68 స్ట్రైక్‌రేట్‌తో నిలిచాడు.

అత్యంత విలువైన జట్టు కోసం… మొత్తం ఆరు దేశాల ఆటగాళ్లను ఎంపిక చేసింది… ICC.కప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌, రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్‌, సెమీ ఫైనల్‌ వరకు వచ్చిన భారత్‌, న్యూజిలాండ్‌తో పాటు… జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల ఆటగాళ్లకు ICC జట్టులో చోటు దక్కింది. ఇంగ్లాండ్‌ రెండోసారి T20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ జోస్‌ బట్లర్‌, ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌లకు ఓపెనర్లుగా ICC జట్టులో స్థానం దక్కింది. మూడో స్థానంలో కోహ్లీ నిలవగా… నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్, ఆరో స్థానంలో జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా, ఏడో స్థానంలో షాదాబ్ ఖాన్, 8వ స్థానంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచిన సీమర్‌ సామ్‌ కరన్‌… 9వ ప్లేస్ లో అన్రిచ్ నార్జే, 10వ స్థానంలో మార్క్ ఉడ్, 11వ స్థానంలో షహీన్ షా అఫ్రీది ఎంపికయ్యారు. ఇక ,128 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసిన టీమ్‌ఇండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య 12వ ఆటగాడిగా ICC టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

Latest News