Ind Vs Pak : ఆసియా కప్ 2025 లో భాగంగా మరికొద్ది గంటల్లోనే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం లక్షలాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలే ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు, విభేదాలు, వివాదాలు విమర్శలు ఉన్నాయి. ఇలా ఉత్కంఠ వాతావరణం ఉన్నప్పటికీ క్రికెట్ మైదానానికి వచ్చే సరికి ఈ మ్యాచ్ ఫలితం పై అందరి దృష్టి ఉంటుంది. బలాబలాల మధ్య ఆకాశమంత అంతరమున్నా.. ఆసక్తి విషయంలో మాత్రం ఎక్కడా లోటు ఉండదు. ముఖ్యంగా ఆటగాళ్లు మారినప్పటికీ.. అభిమానుల్లో మాత్రం పోరు ఉత్సాహం మాత్రం ఉర్రూతలూగుతుంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఘటనను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలంటూ ఎన్నో వైపుల నుంచి పిలుపులు వచ్చినా ఈసారి మాత్రం మ్యాచ్ జరుగుతుంది.
గత ఏడాది టీ-20 ఫార్మాట్ లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసింది. అంతేకాదు.. ఈ ఫార్మాట్ లో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. విధ్వంసకర బ్యాటింగ్ తో నిలకడగా 250 ప్లస్ రన్స్ చేసింది. యూఏఈలో పిచ్ లు కఠినంగా ఉన్నా.. బ్యాటింగ్ కి ప్రతికూలమైనా.. భారీ స్కోర్ నమోదు చేసే సత్తా టీమిండియా కి ఉంది. శుబ్ మన్ గిల్ రీ ఎంట్రీ తో టీమిండియా బ్యాటింగ్ మరింత బలపేతమైంది. అయితే గిల్ కి తాజాగా గాయమైనట్టు సమాచారం. గాయం కారణంగా పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో గిల్ ఆడుతాడా..? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగామారింది. బ్యాటింగ్ తో పాటు భారత బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగానే ఉంది. బుమ్రా ఎంట్రీ ఇవ్వడంతో పేస్ విభాగం బలోపేతమైంది. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తో స్పిన్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. మరోవైపు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అభిషేక్ శర్మ వంటి ఆల్ రౌండర్లు కూడా అందుబాటులో ఉండటంతో టీమిండియా కి మరింత బలం చేకూరనుంది. ఇప్పటివరకు ఆసియా కప్ లో ఇండియా-పాక్ 19 సార్లు తలపడ్డాయి. అందులో 10 మ్యాచ్ లు టీమిండియా విజయం సాధించింది. పాకిస్తాన్ 06 సార్లు విజయం సాధించింది. మూడు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. పాకిస్తాన్ చివరిసారిగా 2022లో దుబాయ్ లో భారత్ ను ఓడించింది.
టీమిండియా టీ-20 ఫార్మాట్ ఆడి చాలా రోజులు అయింది. సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఐపీఎల్ తరువాత ఈ ఫార్మాట్ లో భారత ఆటగాళ్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ పాకిస్తాన్ జట్టు యూఏఈ ట్రై సిరీస్ ఆడింది. ఇందులో అప్గానిస్తాన్ జట్టు పై పాకిస్తాన్ ఓడిపోవడం విశేషం. మరోవైపు టీమిండియా టాప్ ఆర్డర్ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉన్నప్పటికీ.. మిడిలార్డర్ లో ఎవరినీ ఆడిస్తారు..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబేల్లో ఎవ్వర్నీఏయే ఆర్డర్ లో ఆడిస్తారు అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఓపెనర్లుగా శుబ్ మన్ గిల్, అభిషేక్ శర్మ ఆడితే.. సూర్యకుమార్ ఫస్ట్ డౌన్, తరువాత తిలక్ వర్మ, సంజూ శాంసన్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవకాశాన్ని బట్టి ఎలా ఆడుతారో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.