India – Champions Trophy: ఇప్పటి వరకు టెస్టులు, టి-20 లను ఆస్వాదించిన క్రీడాభిమానుల కోసం మరో మెగా టోర్ని మరికొద్ది గంటలలోనే అలరించేందుకు రాబోతోంది. వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేటి నుండి ప్రారంభం అవుతుంది. కరాచీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఫిబ్రవరి 20 అనగా.. రేపు బంగ్లాదేశ్ – భారత్ మధ్య రెండో మ్యాచ్ జరగబోతోంది. ఈసారి ఒక్క మ్యాచ్ లో ఫలితం తారుమారైన సెమీస్ అవకాశాలు మూసుకుపోతాయి. దీంతో టైటిల్ రేసులో నిలిచే టీమ్ లకు ఎవరు షాక్ ఇస్తారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.
అయితే ఈసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం సాధించబోతుందని.. అందుకు ఓ కారణాన్ని కూడా చూపుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు క్రీడాభిమానులు. 2011 – 13 సీన్ రిపీట్ కాబోతుందని.. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపుకు సంబంధించిన ప్రూఫ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అదేంటంటే 2011 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు రెండవ వరల్డ్ కప్ సాధించి కోట్లాదిమంది క్రీడాభిమానుల చిరకాల వాంఛను నెరవేర్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఆ తరువాత స్వదేశంలో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్ లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. అనంతరం ఆస్ట్రేలియా తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్లలో రెండు టెస్ట్ లు డ్రాగా ముగియగా.. మరో రెండింటిలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ ని కూడా ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఆ తరువాత జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే 2011 – 13 సీన్ ని రిపీట్ చేస్తూ.. 2024 – 25 లో.. భారత జట్టు వరల్డ్ కప్ ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. అనంతరం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ని కూడా కోల్పోయింది భారత జట్టు. ఇప్పుడు అదే సీన్ అని రిపీట్ చేస్తూ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయం సాధించబోతుందని సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. మరి నిజంగానే సీన్ రిపీట్ అయ్యి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం సాధిస్తుందా..? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
— Out Of Context Cricket (@GemsOfCricket) February 19, 2025