Big Stories

KKR vs SRH: క్లాసెన్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా.. పోరాడి ఓడిన హైదరాబాద్..

KKR won by 4 runs in a contest against SRH
KKR won by 4 runs in a contest against SRH

IPL 2024 Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పోరాడి ఓడిపోయింది. క్లాసెన్ వీరోచిత ఇన్నింగ్స్ (63, 29 బంతుల్లో; 6X6) వృథా అయ్యింది. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.

- Advertisement -

209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(32, 21 బంతుల్లో; 4X4, 1X6) ఇంపాక్ట్ సబ్ అభిషేక్ శర్మ(32, 19 బంతుల్లో; 4X4, 2X6) అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. 5.3 ఓవర్లలో54 పరుగులు జోడించిన తర్వాత హర్షిత్ రాణా బౌలింగ్‌లో రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 32 పరుగులు చేసిన అభిషేక్ శర్మ రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి రైజర్స్‌ను విజయం దిశగా నడిపించారు. సూయాశ్ శర్మ వేసిన 10వ ఓవర్లో ఈ జంట సిక్స్, ఫోర్ సాయంతో 14 పరుగులు రాబట్టింది.

- Advertisement -

జట్టు స్కోర్ 107 పరుగుల వద్ద హైదరాబాద్.. మార్క్రమ్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన మార్క్రమ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరుసటి ఓవర్లో త్రిపాఠి నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. దీంతో 111 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి సన్ రైజర్స్ కష్టాల్లో పడింది. 13 వ ఓవర్లో 3, 14 వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. 6 ఓవర్లలో 94 పరుగులు కావాల్సిన దశలో క్లాసెన్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 2 సిక్సర్లు సాధించాడు. 16వ ఓవర్ వేసిన స్టార్క్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 17వ ఓవర్ వేసిన రస్సెల్ బౌలింగ్‌లో సమద్ 6,4 కొట్టి అదే ఓవర్లో అవుట్ అయ్యాడు.

సన్‌రైజర్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 60 పరుగులు అవసరమయ్యాయి. వరుణ్ చక్రవర్తి వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ రెండు సిక్సర్లు, షాబాజ్ అహ్మద్ ఒక సిక్స్ బాదడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. సన్‌రైజర్స్ విజయ సమీకరణం 12 బంతుల్లో 39 పరుగులుగా మారింది.

స్టార్క్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికే సిక్స్ కొట్టిన క్లాసెన్, మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు. నాలుగో బంతిని సిక్స్‌గా మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి బంతికి షాబాజ్ అహ్మద్ సిక్స్ కొట్టి విజయ సమీకరణాన్ని 6 బంతుల్లో 13 పరుగులుగా మార్చాడు.. మొత్తంగా 19వ ఓవర్లో స్టార్క్ 26 పరుగులు సమర్పించుకున్నాడు.

చివరి ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన క్లాసెన్ రెండో బంతికి సింగల్ తీసాడు. మూడో బంతికి షాబాజ్ అహ్మద్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నాలుగో బంతికి సింగల్ తీసిన జాన్సెన్ క్లాసెన్‌కు స్ట్రైక్ ఇవ్వగా మరుసటి బంతికి క్లాసెన్ అవుట్ అయ్యాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా డాట్ బాల్ కావడంతో కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. రస్సెల్(64*, 25 బంతుల్లో; 3X4, 7X6), రింకూ సింగ్(23, 15 బంతుల్లో; 3X4) చెలరేగడంతో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్ 2 పరుగులకే రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్.. జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు కొట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో నటరాజన్ వెంకటేశ్ అయ్యర్(7), శ్రేయాస్ అయ్యర్(0) వికెట్లు తీసి కోల్‌కతా టాప్ కూల్చాడు. పవర్ ప్లే ముగిసేసరికి కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 43 పరుగుల చేసింది.

ఆ తర్వాత నితీశ్ రాణా 9 పరుగులు చేసి మయాంక్ మార్కండే బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కోల్‌కతాను రమణ్‌దీప్ సింగ్(35, 17 బంతుల్లో; 1X4, 4X6), ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆదుకున్నారు. 54 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జంటను కమిన్స్ విడగొట్టాడు. జట్టు స్కోర్ 105 వద్ద కమిన్స్ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్ వద్ద మార్కండే అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రమణ్‌దీప్ సింగ్ డగౌట్ చేరాడు.

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సాల్ట్(54, 40 బంతుల్లో; 3X4, 3X6) మార్కండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ దశలో రింకూ సింగ్, ఆండ్రూ రసెల్ కోల్‌కతా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. మార్కండే వేసిన 16వ ఓవర్లో రసెల్ 3 సిక్సర్లు బాదాడు. భువనేశ్వర్ వేసిన 17వ ఓవర్లో 18 పరుగులు సాధించిన ఈ జంట, 18వ ఓవర్లో 15 పరుగులు, భువి వేసిన 19వ ఓవర్లో 26 పరుగులు సాధించారు. చివరి ఓవర్లో 8 పరుగులు మాత్రమే వచ్చాయి. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3, మార్కండే 2, కమిన్స్ 1 వికెట్ తీసుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News