Film industry: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, ఆస్కార్ అవార్డు గ్రహీత తుది శ్వాస విడిచారు. ఈ విషయం అటు యావత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. మరి ఆమె ఎవరు? ఆమె మరణానికి గల కారణాలేంటి? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
హాలీవుడ్ నటి ,ఆస్కార్ అవార్డు గ్రహీత డయాన్ కీటన్(Diane Keaton) తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 79 సంవత్సరాలు. కాలిఫోర్నియాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అయితే డయాన్ మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె మరణ వార్త విని యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురవుతోంది. ఆమె మరణానికి పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.
డయాన్ కీటన్ విషయానికొస్తే.. ‘ది గాడ్ ఫాదర్’ అనే చిత్రం లో కే ఆడమ్స్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 1972లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 1977లో ‘ఆనీ హాల్’ అనే మరో చిత్రంలో అద్భుతమైన నటన కనపరిచి.. ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. దాదాపు 50 ఏళ్ల పాటు చలనచిత్ర పరిశ్రమలోనే కొనసాగింది డయాన్ కీటన్. ఒక గొప్ప నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె ఇలా తుది శ్వాస విడవడం, దానికి గల కారణాలు తెలియకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1946 జనవరి 5న లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియాలో జన్మించింది. అమెరికన్ నటిగా పేరు సొంతం చేసుకున్న ఆమె .. ఐదు దశాబ్దాలుగా తన సినీ కెరియర్లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు అకాడమీ అవార్డు, బాప్టా అవార్డుతో పాటు రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, రెండు ఎమ్మీ అవార్డులు అలాగే టోనీ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. 2007లో ఫిలిం సొసైటీ ఆఫ్ లింకన్ సెంటర్ గాలా ట్రిబ్యూట్ అలాగే 2017లో AFI లైఫ్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించబడింది. 1968లో బ్రాడ్ వే నిర్మాణంలో వచ్చిన మ్యూజికల్ హెయిర్ చిత్రం ద్వారా నటన రంగ ప్రవేశం చేసింది డయాన్.
ALSO READ:Ritika Nayak: జోరు పెంచిన మిరాయ్ బ్యూటీ.. ఘనంగా స్టోర్ లాంఛ్