
Mitchell Marsh : వన్డే క్రికెట్ వరల్డ్ కప్ అంటే అదొక అందమైన కల..అది అందిన రోజున అంతా సంతోషంపడాలి గానీ, అహంకారంతో కన్నుమిన్ను కానకుండా ప్రవర్తించకూడదు. నువ్వెంత గొప్ప ఆటగాడివైతే మాత్రం ఇంత గర్వం పనికిరాదని నెట్టింట అప్పుడే మంట రాజుకుంది.
ఇంతక తనేం చేశాడంటే, ఒక సోఫాలో కూర్చుని, గెలిచిన ప్రపంచకప్ మీద తను కాళ్లు పెట్టి ఫొటోకి ఫోజిచ్చాడు. ప్రపంచకప్ ని ఆరుసార్లు గెలిచాం…ప్రపంచ క్రికెట్ అంతా తమ పాదాక్రాంతమని అర్థం వచ్చేలా మితిమీరిన గర్వంతో ప్రవర్తించాడు.
దీనికి నెట్టింట పలు కామెంట్లు వినిపిస్తున్నాయి.
‘‘ఒరేయ్ బాబూ… రెండుసార్లు కప్పులు గెలిచి అలా విర్రవీగిన వెస్టిండీస్ పరిస్థితి ఏమైంది….నేడెలా ఉంది?
క్లైవ్ లాయిడ్, రిచర్డ్స్, మాల్కం మార్షల్ లాంటి గొప్ప ఆటగాళ్లు ఉండటం వల్ల సాధ్యమైంది. ఈరోజున మీరున్నారు. మీ తర్వాత ఎవరొస్తారో ఎవడికి తెలుసు. మీరు బాగా ఆడి ఉండవచ్చు. ఇప్పటికే మీలో ఐదుగురి వయసైపోయింది. అందుకని మితిమీరిన అహంకారం ఎప్పటికైనా ప్రమాదమే…అంటున్నారు’’
ఐసీసీ దీనిపై చర్య తీసుకోవాలి అని కొందరు డిమాండ్ చేస్తున్నారు. వాళ్లెంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన వరల్డ్ కప్ ని ఇలా అవమానిస్తాడా? అని కొందరు వ్యాక్యానిస్తున్నారు. ప్రపంచమంతా క్రికెట్ కి ఎన్నో కోట్లమంది అభిమానులు ఉన్నారు. వారందరూ ఈరోజున ఎంతో బాధపడుతున్నారని కామెంట్ చేశారు. అదే ఇండియాకి వచ్చుంటే గుండెలపై పెట్టుకునేవారని భారతీయులు కామెంట్ చేస్తున్నారు.
ఓరి ఓరి ఇంతటి దుర్మార్గుల చేతుల్లో పడేందేంట్రా వరల్డ్ కప్ అని బాధపడేవాళ్లు కొందరున్నారు. మొత్తానికి ప్రపంచ కప్ గెలిచి, వివాదాలను కూడా ఆస్ట్రేలియా మోసుకెళుతోంది.
ఎవరైనా వరల్డ్ కప్ గెలిచాక.. ట్రోఫీని ముద్దాడుతూనో.. చేతుల్లో పట్టుకొనో ఫొటో దిగుతారు. కానీ టీ20ల్లో ఆస్ట్రేలియా కాబోయే కెప్టెన్ మిచెల్ మార్ష్ మాత్రం ట్రోఫీ మీద కాళ్లు పెట్టి ఫొటోలు దిగడం క్షమించరాని నేరంగానే ఉంది. క్రికెట్ ని నిజంగా ప్రేమించేవాళ్లు ఇలా చేయరని అంటున్నారు. ఆస్ట్రేలియా గర్వాన్ని అణచాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. మీకిదే చివరి వరల్డ్ కప్ అని అందరూ శాపనార్థాలు పెడుతున్నారు.