
Purandeswari comments on Jagan(Latest political news in Andhra Pradesh) :
బీజేపీ ఏపీ అధ్యక్షురాలికి బాధ్యతలు చేపట్టిన తర్వాత దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి పురందేశ్వరి, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి చేసిన విమర్శలకు ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. తాజాగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీలో జరుగుతున్న విధ్వంసక పాలనను ప్రజలు గమనిస్తున్నారని పురందేశ్వరి అన్నారు. ఒంగోలులో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో వైసీపీ ప్రభుత్వం వైఖరిపై పురందేశ్వరి మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై రాష్ట్ర సర్కార్ కేసులు పెడుతోందని ఆరోపించారు. వారిని ఇబ్బంది పెడుతోందన్నారు. 27 ఎస్సీ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
ఏపీలో బీసీ, ఎస్సీలపై దాడులు జరగుతున్నాయని పురందేశ్వరి ఆరోపించారు. వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు, విధులు లేని 56 కార్పొరేషన్లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సెటైర్లు వేశారు. వెనుకబడిన వర్గాల కోసం సామాజిక బస్సు యాత్ర నిర్వహించే అర్హత వైసీపీకి లేదని పురందేశ్వరి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సందర్భం వచ్చిన ప్రతిసారి వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలోనూ విమర్శలు చేశారు. కక్షపూరిత చర్యగా పేర్కొన్నారు. అదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కేంద్రం హోంమంత్రి అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్, రాష్ట్ర తాజా పరిణామాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో వైసీపీ నేతలు పురందేశ్వరికి కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు ఏపీలో మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి.
Revanth Reddy : 10 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధం.. కేసీఆర్ కు రేవంత్ సవాల్.. కేటీఆర్ కు కౌంటర్..