Mohammad Rizwan: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా ఆతిధ్య పాకిస్తాన్ జట్టు ఆడిన రెండు మ్యాచ్లలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటములతో పాకిస్తాన్ సెమిస్ చేయకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం పాకిస్తాన్ కి రాగా.. ఆ జట్టు లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో ఆ దేశ మాజీ ఆటగాళ్లతో పాటు అక్కడి క్రీడాభిమానులు కూడా తీవ్రంగా నిరాశకు గురయ్యారు.
అయితే తాజాగా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడాడు. అందులో మహమ్మద్ రిజ్వాన్ ఇంగ్లీష్ మాట్లాడిన విధానాన్ని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ టీవీ యాంకర్ తబీష్ హష్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తబీష్ హష్మీ.. మొహమ్మద్ రిజ్వాన్ నైపుణ్యాలను ఎగతాళి చేసినట్లుగా మాట్లాడారంటూ పాకిస్తాన్ క్రీడాభిమానులు మండిపడుతున్నారు.
ఆ దేశ టీవీ యాంకర్ తబీష్ హష్మీ ఏమన్నారంటే.. ” మహమ్మద్ రిజ్వాన్ 25 కోట్ల మంది ప్రజల తరఫున ప్రతినిథ్యం వహించాడు. అతడు చూడడానికి చక్కగా అనర్గళంగా మాట్లాడాలని, క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటాం. కానీ ఇటీవల రిజ్వాన్ మీడియా సమావేశాలలో మాట్లాడడం చూశాను. అతడు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని నేను అనడం లేదు. కానీ మహమ్మద్ రిజ్వాన్ ఉర్దూలో చక్కగా మాట్లాడగలడు” అంటూ యాంకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఈ వ్యాఖ్యలకు క్రికెటర్ అహ్మద్ షజాద్ నవ్వాడు. దీంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ యాంకర్ వ్యాఖ్యలపై స్పందించిన పాకిస్తాన్ నెటిజెన్లు.. ” మన దేశ జట్టు కెప్టెన్ నే ఎగతాళి చేస్తారా..? ఇది సరైన పద్ధతి కాదు” అని కొందరు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు మాత్రం ఆ యాంకర్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు. 2023 ఫిబ్రవరి నెలలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారంటూ వైరల్ చేస్తున్నారు.
అయితే గతంలో షోయబ్ అక్తర్ ఏమన్నారంటే.. పాకిస్తాన్ జట్టుకి ఓ క్యారెక్టర్ అంటూ లేదు. వీళ్లకు మీడియా ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇంగ్లీష్ మాట్లాడడం, నేర్చుకోవడం అంత కష్టమా..? క్రికెట్ లోకి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన దేశాల క్రికెటర్లతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. లేదు నేను హిందీలోనే మాట్లాడుతా అని అనుకుంటే సరిపోదు. టీవీ ముందు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడితేనే ప్రపంచ దేశాలు మన వైపు చూస్తాయి.
బాబర్ అజామ్ కి పాకిస్తాన్ లో మంచి బ్రాండ్ ఉంది. కానీ అతడు పాకిస్తాన్ కి బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు మారడం లేదు. ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ రాదు. కేవలం నేను, షాహిద్ ఆఫ్రిది, వసీమ్ అక్రమ్ మాత్రమే ఇంగ్లీష్ లో మాట్లాడగలం. మేము కొన్ని బ్రాండ్లకు యాడ్స్ కూడా చేస్తున్నాం ” అంటూ గతంలో సోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఓటమి కారణంగా.. వారి పరువును వాళ్లే తీసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు క్రీడాభిమానులు.
That's what happens when non cricket anchors suddenly become cricket experts during ICC events then they pull of stunts like this. Look at him mocking Rizwan's English and A Shehzad laughing in his usual moronic way. Shameful behaviour overall. pic.twitter.com/ou3aT2HBAW
— Hassan (@Gotoxytop2) February 28, 2025