
pakistan cricketers: క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అయితే ఇన్ని కోట్లమంది అభిమానులున్న దేశంలో ప్రజల మనోభావాలను గెలవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రస్తుతం పాకిస్తాన్
ఆ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే ఈసారి వన్డే వరల్డ్ కప్ 2023 లో చాలా సంచలనాలు నమోదయ్యాయి. అయితే అంతా పాక్ మీదే పడ్డారు గానీ, ఇంగ్లండ్, శ్రీలంక జట్ల పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే ఇంగ్లండ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది.
కానీ కెప్టెన్ బట్లర్ మాత్రం మేం డిఫెండింగ్ ఛాంపియన్లం, ఏదో రెండు మ్యాచ్ లు ఓడిపోయినంత మాత్రాన మమ్మల్ని తక్కువగా అంచనా వేయవద్దని అన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్, 2023 టీ 20 ప్రపంచ కప్ ఎలాంటి పరిస్థితుల్లో గెలిచామో మాకు తెలుసు. అప్పుడే ఏమీ అయిపోలేదు. ఇంకా చాలా మ్యాచ్ లు ఆడాలి. అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ సౌతాఫ్రికా మీద కూడా తేలిపోయేసరికి మ్యాచ్ చూద్దామని ఇంగ్లండ్ నుంచి వచ్చిన క్రికెట్ అభిమానులు ముఖాలు చూపించలేక అవస్థలు పడ్డారు.
శ్రీలంక పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే మొన్నటి వరకు ఆస్ట్రేలియా కూడా తొమ్మిదో స్థానంలోనే ఉండి, ఇప్పుడిప్పుడే మెరుగైన స్థితికి చేరి టాప్ 4లోకి వెళ్లింది. అందువల్ల ఇంకా ఆడాల్సిన మ్యాచ్ లు చాలా ఉన్నాయి. అయితే పాకిస్తాన్ జట్టు వరుస వైఫల్యాలకు కారణం కెప్టెన్ బాబర్ ఆజమ్ అనే కారణంతో సోషల్ మీడియా వేదికగా మీమ్స్ తో ఆడుకుంటున్నారు.
ఇలాంటి జట్టునేసుకుని ఏ కెప్టెన్ కూడా ఆటాడలేడు…ఇంక ఆడి అనవసరం, వెంటనే ఫ్లయిట్ ఎక్కి వచ్చేయండి అని ట్వీట్లు పెడుతున్నారు. మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి పాక్ టీమ్ మాత్రం అవమాన భారంలో మునిగిపోయింది.
వీరి పరిస్థితి ఇలా ఉందంటే ఆఫ్గానిస్తాన్ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచాలే కాదు, తుపాకుల శబ్దాలతో దద్ధరిల్లిపోయింది. పాకిస్తాన్ లో విషాదం అలముకుంటే, ఆఫ్గాన్ లో ఆనందం తాండవిస్తోంది.
ఇండియాలో కూడా ఇలాంటి పరిస్థితిని మన క్రికెటర్లు చాలా సందర్భాల్లో ఎదుర్కొన్నారు. అభిమానుల ఆగ్రహాన్ని చవి చూశారు. మ్యాచ్ ఫిక్సింగ్ సందర్భంలో అయితే క్రికెటర్ల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ధోనీ, సచిన్ లాంటి ఆటగాళ్లు తీవ్ర నిరసనలు ఎదుర్కొన్నారు. అవమానాలు పడ్డారు. క్రికెటర్ల ఇళ్లపై ప్రజలు రాళ్లు కూడా విసిరారు.
అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు క్రికెట్ పై అభిమానాన్ని ఇంత వెర్రితలలు వేసేంతగా పెంచి పోషించిన బీసీసీఐ, ఐసీసీ పాత్ర కూడా ఇందులో ఉందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు.