
PAK vs AFG : అండర్ డాగ్స్ గా వరల్డ్ కప్ 2023లో అడుగుపెట్టిన ఆఫ్గాన్స్ అదరగొట్టే పెర్ ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మీద నెగ్గి మంచి ఊపు మీద ఉన్న వారు పాకిస్తాన్ మీద నెగ్గి అంబరాన్ని అంటే సంబరాలు చేసుకున్నారు. ఇటీవల రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంత ఆశాజనకంగా లేని సమయంలో ఇలా గెలవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అంతేకాదు ఏడు మ్యాచ్ ల్లో వరుస ఓటములతో కుదేలైపోయిన వారు…ఒక్కసారి గెలిచేసరికి వారి సంబరాలు అంబరాన్ని అంటాయి.
క్రికెట్ గ్రౌండ్ అంతా ఆనందంతో పరుగులు పెట్టారు. వీరి ఆనందానికి గ్రౌండ్ లో ఉన్న ఇర్ఫాన్ పఠాన్ కూడా తోడయ్యాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. తర్వాత బస్సులో హోటల్ కి వెళుతూ అక్కడ కూడా అల్లరల్లరి చేశారు. బాలీవుడ్ బాద్ షా లుంగి డ్యాన్స్ పాటకు స్పెప్పులేసి అదరగొట్టారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రషీద్ ఖాన్ ఇక్కడ కూడా తన జోష్ ని కొనసాగిస్తూ సహచరుల్లో కూడా ఊపు తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ గెలుపు వారికెంత కిక్ ని ఇచ్చిందో వారి ఆనందాన్ని చూస్తే అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఎంత ఉద్వేగభరితంగా ఉంటుందో ఇప్పుడు ఆఫ్గాన్ కూడా ఆ కేటగిరీలోకే వచ్చి చేరింది. పాకిస్తాన్ మీద వారికి పీకల వరకు కోపం ఉందన్న సంగతి ఈ మ్యాచ్ ద్వారా తేటతెల్లమైంది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 87 పరుగులతో పాక్ ఓటమిలో కీలక పాత్ర పోషించిన జద్రాన్ తనకు వచ్చిన అవార్డును పాకిస్తాన్ నుంచి బలవంతంగా పంపేసిన ఆఫ్గాన్ వాసులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఇది వారి మనసుల్లో ఉన్న ఆవేదనకు అర్థం పట్టిందని కొందరన్నారు. అయితే క్రీడావేదికలపై ఇలా వ్యాక్యానించడం సరికాదని మరికొందరు అన్నారు.
అఫ్ఘానిస్తాన్ తన తర్వాతి మ్యాచ్‌లను శ్రీలంక, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో ఆడనుంది. నెదర్లాండ్స్, శ్రీలంక మీద అయితే గెలిచే అవకాశాలున్నాయి. ఆపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై గెలిస్తే మాత్రం సెమీస్ లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకీ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఆస్ట్రేలియా ఒక దశలో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా అయితే నెదర్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. శ్రీలంక జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. మిగిలిన నెదర్లాండ్ జట్టుతో కొంచెం జాగ్రత్తగా ఆడితే ఆఫ్గాన్ కి తిరుగు ఉండదని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.