IND Vs PAK : ఆసియా కప్ 2025 లో భాగంగా ఇవాళ సూపర్ 4 లో రెండో మ్యాచ్ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగనుంది. ఈ నేపథ్యంలోనే సూపర్ 4 మ్యాచ్ కి ముందే పాకిస్తాన్ జట్టు కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ సైకాలజిస్ట్ ను కూడా నియమించింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో టాస్ వేసిన సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో పాకిస్తాన్ జట్టు షేక్ హ్యాండ్ వివాదాల్లో చిక్కుకొని అప్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక టీమిండియాతో జరిగే మరో మ్యాచ్ లో అలాంటి పరిస్థితులు జరుగకూడదని.. ప్లేయర్లు బాగా ఆలోచించి… టీమిండియాపై గెలించేందుకు అతన్ని నియామకం చేసుకున్నట్టు సమాచారం.
Also Read : IND Vs PAK : నేడు పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్.. “నో షేక్ హ్యాండ్” తరువాత మరో సమరం
సెప్టెంబర్ 14న లీగ్ దశలో జరిగిన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ తరువాత చోటు చేసుకున్న “షేక్ హ్యాండ్” వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు దేశాల మధ్య సమరం మరింత హీటెక్కించింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా పై ఎలాగైనా విజయం సాధించి ప్రతీకారం తీసుకోవాలని కొత్త ప్రణాళికలను రచిస్తోంది పాక్. ముఖ్యంగా భారత్ తో మ్యాచ్ లో ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు.. గత మ్యాచ్ లో ఎదురైన ఓటమి నుంచి తేరుకునేందుకు పాకిస్తాన్ మేనేజ్ మెంట్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. తమ ఆటగాళ్లను మానసికంగా మరింత ధృడంగా మార్చేందుకు ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రహీల్ కరీం ను సంప్రదించింది.
దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లకు డాక్టర్ రహీల్ కౌన్సిలింగ్ తీసుకోవడంతో పాటు మోటివేషనల్ సెషన్ నిర్వహించినట్టు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. మరోవైపు భారత్ తో జరిగే మ్యాచ్ లో ఒత్తిడిని అధిగమించడం ఎలా..? తొందరపాటు పడకుండా ఎలా కంట్రోల్ గా ఉండాలనే విషయాలపై పాకిస్తాన్ ఆటగాళ్లకు పలు సూచనలు కూడా చేసినట్టు సమాచారం. లీగ్ దశలో జరిగిన మ్యాచ్ పాకిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 127 పరుగులకే పరిమితమైంది. దీంతో 100 పరుగులు అయినా చేస్తుందా..? అని అనిపించింది. కానీ షాహిన్ అఫ్రిది భారీ సిక్సర్లతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. భారత్ 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి.. ఘన విజయాన్ని అందుకుంది. విజయమే లక్ష్యంగా పాకిస్తాన్ సన్నద్ధమవుతుంటే.. భారత్ ఎలాగైనా గెలుస్తామనే ధీమాతో భారత్ ఉండటం విశేషం.