Prithvi Shaw: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీషాకు చేధు అనుభవం ఎదురైంది. అభిమానులు అతడిని చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే పృథ్వీ అందరికీ సెల్ఫీలు ఇవ్వకపోవడంతో వాళ్లు అతని కారుపై దాడి చేశారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
బుధవారం పృథ్వీషా తన స్నేహితుడు అశిశ్ సురేంద్రతో కలిసి ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్లాడు. ఈక్రమంలో ఓ గ్యాంగ్ సెల్ఫీల కోసం పృథ్వీషాను చుట్టుముట్టింది. అయితే తనకు సమయం లేదని.. కేవలం ఇద్దరికి మాత్రమే సెల్ఫీ ఇస్తానని పృథ్వీషా వారితో చెప్పాడు. అయినా కూడా వారు వినకుండా ఇబ్బంది పెట్టడంతో.. అతని ఫ్రెండ్ ఆశిశ్ హోటల్ మేనేజర్‌ను పిలిచి కంప్లైంట్ చేశాడు.
దీంతో వారిపై కోపం పెంచుకున్న ఆ గ్యాంగ్ వారి కోసం హోటల్ బయట మకాం వేశారు. కారులో హోటల్ నుంచి బయటకు రాగానే బేస్‌బాల్ బ్యాట్లతో దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పృథ్వీ షా అతని స్నేహితునితో కలిసి మరో కారులో ఇంటికి వెళ్తుండగా.. ఓ మహిళ వాళ్లను వెంబడించింది. మధ్యలో వారి కారును అడ్డుకొని ఈ సమస్యను పరిష్కరించాలంటే తనకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే తప్పుడు కేసులు పెడుతానని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది.
అయితే వాళ్లు అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులు సనా అలియాస్ సప్నా గిల్, శోభిత్ ఠాకూర్‌లను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మొత్తం 8 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.