Ashwin YouTube Channel : ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్న ప్రత్యేకత గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఈ టీమ్ గత 18 సంవత్సరాల కాలంలో దాదాపు 12 సార్ల వరకు ఫైనల్ కి చేరుకుంది. 15 సార్లు ప్లే ఆప్స్ కి చేరుకుంది. చెన్నై టీమ్ అంటేనే అభిమానులకు ఒక ఊపు వస్తుంటుంది. కానీ అలాంటి ఈ సీజన్ లో చెన్నై ఆశించిన మేరకు ఆడటం లేదని అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో భారీ అంచనాలతో బరిలోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది.
ఇప్పటి వరకు వరకు ఆడినటువంటి నాలుగు మ్యాచ్ లలో కూడా చెన్నై జట్టు మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇక జట్టు తరపున కీలక బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపించడం లేదు. చెన్నై తరపున ఆకట్టుకుంటుంది మాత్రం స్పిన్నర్ నూర్ అహ్మదే. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ లలో 10 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు. అతని పై సొంత జట్టు ఆటగాడికి చెందిన యూట్యూబ్ ఛానల్ విమర్శలు చేసి వివాదంలో చిక్కుకోవడం విశేషం. ఈనెల 5న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఓడిపోయింది.
అయితే చెన్నై కీలక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ లో ఒక ప్యానలిస్ట్ మాట్లాడుతూ.. నూర్ అహ్మద్ పై నోరు పారేసుకున్నాడు. అతన్ని మెగా వేలంలో చెన్నై కొనుగోలు చేసి ఉండాల్సింది కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అశ్విన్ ఛానల్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చెన్నై మ్యాచ్ ల కవరేజ్ కి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది అశ్విన్ ఛానెల్. గత వారం రోజులు గా ఈ ఫోరమ్ లో జరిగిన చర్చలను దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్ లో మిగతా CSK మ్యాచ్ ల కవరేజ్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని ఆ ఛానల్ అడ్మిన్ పేర్కొన్నాడు.
ఇక ఈ ఛానల్ లో గెస్ట్ లు వెల్లడించనటువంటి అభిప్రాయాలకు రవిచంద్రన్ అశ్విన్ కి ఎలాంటి సంబంధం లేదని అడ్మిన్ వెల్లడించారు. అంతకు ముందే చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. అశ్విన్ కి ఒక ఛానల్ ఉందన్న విసయం తనకు తెలియదని.. వాటిని తాను అనుసరించనని తెలిపారు. వరుసగా మడు మ్యాచ్ లు ఓడిపోయిన చెన్నై జట్టు తన తదుపరి పోరులో ఈనెల 8న పంజాబ్ తో మ్యాచ్ ఆడేందుకు సిద్దం అవుతోంది. చెన్నై టీమ్ లో కీలక ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం.. అభిమానులను ధోనీ ఆకట్టుకోవడం విశేషం. కొన్ని మ్యాచ్ లలో టీమ్ ఓడిపోయినప్పటికీ ఎం.ఎస్. ధోనీ మాత్రం తనదైన శైలిలో మ్యాచ్ లో సిక్స్ లు కొడుతూ ప్రేక్షకులను అలరించాడు. టీమ్ లో ఈ సీజన్ లో ఏ ఆటగాడు భారీ ఇన్నింగ్స్ ఆడటం, పరుగులు చేయకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ కాస్త తడబడుతోంది. దీంతో మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.