Rizwan On ICC Jay Shah: పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ( Mohammaed Rizwan) పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అలాగే డ్రెస్సింగ్ రూమ్ సమాచారం లీక్ అయిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహమ్మద్ రిజ్వాన్, తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( I C C) మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా జై షాకు (Jay Shah) సంచలన లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో తనకు నరకం చూపిస్తున్నారని వెల్లడించారు. వెంటనే ఈ కేసులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఐసీసీకి రిజ్వాన్ చేసిన ఫిర్యాదు న్యూస్ హాట్ టాపిక్ అయింది.
మహమ్మద్ రిజ్వాన్ ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తో పాటు డ్రెస్సింగ్ రూమ్ సమాచారం లీక్ సంఘటనలో ఇరుక్కున్నాడు. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తెలియడంతో వెంటనే విచారణ ప్రారంభించింది. వాస్తవానికి ఈ విచారణలను ఐసీసీ చేయాలి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ… ఈ కేసును దర్యాప్తు చేయడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే మహమ్మద్ రిజ్వాన్ కు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ… హైకోర్టు మెట్లు ఎక్కారు. అయితే రిజ్వాన్ వేసిన ఈ పిటిషన్ ను తిరస్కరిస్తూ… దర్యాప్తు సంస్థలకు సమాధానం ఇవ్వాల్సిందేనని లాహోర్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో మహమ్మద్ రిజ్వాన్ కు ఊహించని షాక్ తగిలింది.
లాహోర్ హైకోర్టు చెంప చెల్లుమనేలా కొట్టడంతో.. వేరే దారి లేక ఐసీసీ తలుపు తట్టాడు మహమ్మద్ రిజ్వాన్. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే లండన్ హోటల్ లో ఉన్న తన మొబైల్స్ లాక్కున్నారని ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. మూడు గంటల్లో ఫోన్లు ఇస్తామని.. జప్తు చేసినట్లు నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పై జై షాకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వివాదాలు జరిగినప్పుడు ICC విచారణ చేయాలి తప్ప… పాకిస్తాన్ ఎందుకు విచారణ చేస్తుందో తనకు సమాధానం కావాలన్నారు. ఈ కేసు విషయంలో వెంటనే ఐసీసీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఇక రిజ్వాన్ సంఘటనపై షోయబ్ అక్తర్ కూడా స్పందించారు. రిజ్వాన్ కావాలనే టార్గెట్ చేశారంటూ సీరియస్ అయ్యారు. అతని కెరీర్ ముగించేలా కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు షోయబ్ అక్తర్.