
Rohit Sharma : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకెంతో బలంగా మారాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో ఇండియా ఇన్ని మ్యాచ్ లు వరుసగా గెలవడం వెనుక రోహిత్ శర్మ దూకుడెంతో ఉంది. ముఖ్యంగా ఓపెనర్ గా వచ్చి పవర్ ప్లే లో తన దూకుడైన ఆటతో జట్టుకి శుభారంభాలు ఇస్తున్నాడు.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తన ఔట్ అయ్యేలోపు టీమిండియా పునాదులను బలంగా వేస్తున్నాడు. ఇక అక్కడ నుంచి నిర్మాణ బాధ్యతలన్నీ కోహ్లీ చూసుకుంటున్నాడు. తర్వాత శ్రేయాస్, రాహుల్, సూర్య కలిపి కొట్టేస్తున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ ఇన్‌స్వింగర్‌కు రోహిత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. అఫ్గాన్ పై పోరులో తన ట్రేడ్‌మార్క్ షాట్లతో వరల్డ్ కప్‌లోనే భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేశాడు. దీనిని కేఎల్ రాహుల్ వెంటనే అధిగమించాడు. ఆ తర్వాత రోహిత్ పాకిస్థాన్ బౌలర్లపై అదే షాట్లతో విరుచుకుపడి వారిని కోలుకోకుండా చేశాడు.
మిగిలిన మ్యాచుల్లో తనదైన దూకుడు ఆటతో ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేస్తున్నాడు. ఎప్పుడైతే స్టార్టింగ్ లోనే పికప్ పోయిందో, ఆ తర్వాత ప్రత్యర్థులు మళ్లీ దాన్ని అందిపుచ్చుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు, సెంచరీలు కోల్పోతున్నా రోహిత్ లెక్క చేయడం లేదు. 9 మ్యాచుల్లో 121.50 స్టైక్ రేట్ తో 503 పరుగులు చేశాడు. ఈ దూకుడే టీమిండియాకు బలంగా మారింది.
రోహిత్ కి వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీల్లో అద్భుత రికార్డు ఉంది. ఇప్పుడు ఆడేది మూడో వరల్డ్ కప్ అయినా, ఎవరికి సాధ్యం కాని విధంగా ఏడు సెంచరీల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సిక్సర్లు అలవోకగా బాదేస్తున్నాడు. ఒకే కేలండర్ ఇయర్ లో వన్డేల్లో ఏబీ డీ విలియర్స్ (58) సిక్సర్ల రికార్డ్ ని దాటేశాడు. ప్రస్తుతం 60 సిక్స్ లు కొట్టాడు. సెమీఫైనల్ లో ఎన్ని కొడతాడో చూడాల్సిందే. అలాగే వరుస ప్రపంచకప్పుల్లో ఐదు వందలకి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు.
అంతేకాదు కెప్టెన్సీ విషయంలో తన మార్కు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆడిన అన్ని మ్యాచ్ లను చూస్తే, ఫీల్డ్ సెట్టింగ్, బౌలర్లను వినియోగించుకున్న తీరు, డీఆర్ఎస్ వాడిన విధానం అన్నీ హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, సిరాజ్ పై రోహిత్ శర్మ ఉంచిన నమ్మకాన్ని వారు వమ్ము చేయలేదు.
బౌలర్స్, బ్యాటర్స్ వారి బలహీనతలు, వారెక్కువ ఏ బాల్స్ కి అవుట్ అవుతున్నారు..వీటన్నింటితో చక్కని గేమ్ ప్లాన్ రాసుకుంటూ, దానిని గ్రౌండ్ లో సమర్థవంతంగా అమలు చేస్తున్నాడు. ఒకవైపు నుంచి స్పిన్, మరోవైపు నుంచి ఫాస్ట్ బౌలింగ్ ని బ్యాలెన్స్ చేస్తూ వాడుతున్నాడు. తొమ్మిదిమందితో బౌలింగ్ చేయించడం వెనుక మర్మం కూడా అదే అంటున్నారు.
పిచ్ స్వభావాన్ని బట్టి బౌలర్లను మారుస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. మొత్తానికి బ్యాటింగ్ తోపాటు, తన దూకుడైన కెప్టెన్సీ స్కిల్స్ తో టీమిండియాకు అతి పెద్ద బలంగా మారాడు. అతడే ఒక సైన్యంగా మారాడు. ముందుండి నడిపిస్తున్నాడు.