
AP Weather : ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశముంది.ఈ నెల 16 నాటికి అది కాస్తా వాయుగుండంగా బలపడనుంది. ఈ ప్రభావంతో బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశముందన్నారు.
బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప, శ్రీ సత్యసాయి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు వాతావరణశాఖ అధికారులు. కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
మరోవైపు తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. తమిళనాడులోని పలు జిల్లాలు, పుదుచ్చేరిలో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కడలూరు, మైలాడుదురై, విల్లుపురం జిల్లాల్లోని విద్యా సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించగా.. పుదుచ్చేరి కూడా స్కూల్స్‌ను మూసివేసింది.
తమిళనాడుకు ఎంతో కీలకమైన ఈశాన్య రుతుపవనాలు ఈ ఏడాది ఆలస్యంగా ప్రవేశించాయి. గతవారం సాధారణం కంటే 17 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. ఆ రాష్ట్ర తాగు, సాగు నీటి అవసరాలకు ఈ రుతుపవనాలే పెద్ద దిక్కు.
.
.
.