
Rohit Sharma : నెదర్లాండ్స్ తో జరగనున్న ఇండియా మ్యాచ్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఒకరు దీపావళి అంటున్నారు. ఒకరు తగ్గేదేలే అంటున్నారు. ఒకరేమో వెరైటీగా రోహిత్ భయ్యా..టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీస్కో అని కోరుతున్నారు.
అభిమానులు చెప్పేదేమిటంటే ‘పిచ్ గిచ్ జాన్తా నై..అగర్ టాస్ జీతా హై, పెహలే బ్యాట్ కరే..’ అని మెసేజ్ లు పెడుతున్నారు. ఎందుకిలా అంతా బౌలింగ్ వద్దు. బ్యాటింగ్ అంటున్నారని అంటే ఒక కొత్త విషయం తెలిసింది. దీంతో ఇదన్నమాట సంగతి అనుకుంటున్నారు.
ఇంతకీ అదేమిటంటే ఒకవేళ బౌలింగ్ తీసుకుంటే మన పేస్ త్రయం ముగ్గురు బుమ్రా, సిరాజ్, షమీ కలిసి వాళ్లని 50 పరుగులకే చాపలా చుట్టేస్తే, మా పరిస్థితేమిటి? అంటున్నారు. ఆదివారం పండగ అంతా దండగై పోతుంది. అందుకే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకో అన్నా.. అని బతిమాలుతున్నారు. అంతే కాదు టాస్ గెలవాలని దేవుడిని కోరుకుంటున్నామని కూడా చెబుతున్నారు.
అలా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే నెదర్లాండ్స్ మీద రోహిత్ శర్మ వీర బాదుడు, సూర్య కుమార్ ఉతుకుడు, కోహ్లీ మెరుపులు, ఇవన్నీ చూసి తీరాల్సిందేనని అంటున్నారు.
అయితే ఇండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం, అదెంత ప్రమాదకరంగా మారిందో గడిచిన అనుభవాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంక పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ రోజున 55 పరుగులకే ఆలౌట్ అవడం చారిత్రాత్మక తప్పిదంగా మారిపోయింది.
ముందు శ్రీలంక బోర్డు రద్దయ్యింది. ఇప్పుడు ఏకంగా ఐసీసీ సభ్యత్వమే పోయింది. దీంతో శ్రీలంక క్రికెట్ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది. మన బౌలర్ల ధాటికి ఎంత పెద్ద విధ్వంసం జరిగిందో చూశారు కదా.. ఒకవైపు క్రీడాలోకం ఆందోళన చెందుతోంది. అయితే మన బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు అవతల జట్ల బ్యాటర్లు మాత్రం గిలగిలలాడుతున్నారు.
షమీ వచ్చిన తర్వాత జరిగిన నాలుగు మ్యాచుల్లో మూడింట స్కోర్లు ఇలా ఉన్నాయి. శ్రీలంక 55, ఇంగ్లండ్ 129, సౌతాఫ్రికా 83 ఇదీ పరిస్థితి. అందుకే అందరూ రోహిత్ అన్నా బౌలింగ్ వద్దు..అని అంటున్నారు. మరి నిజమే కదండీ..మన ఓటు కూడా అదే కదా..