SA vs IND 2nd T20 : వన్డే వరల్డ్ కప్ 2023లో ఫైనల్ వరకు అప్రతిహితంగా వెళ్లిన ఆనందం, వెంటనే ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ లో 4-1 గెలిచిన సంతోషం అన్నిటితో వచ్చిన బూస్ట్ తీసుకుని, సౌతాఫ్రికాలో అడుగు పెట్టారు. తీరా మనవాళ్ల ఆశల మీద వరుణ దేవుడు ఆశలు చల్లి, మొదటి టీ 20ని వర్షార్ఫణం చేశాడు.
రెండో టీ 20లో అయినా టీమ్ ఇండియా ఇరగదీసి ఆడుతుందని అనుకుంటే, ఇద్దరు ఓపెనర్లు కలిసి రెండు గుండు సున్నాలు పెట్టడంతో నిశ్చేష్టులయ్యారు. నిజానికి తొలి టీ 20 జరిగుంటే పర్వాలేదు. కానీ ఇక్కడ జరిగిన రెండో టీ 20 మ్యాచ్, తొలి టీ 20గా మారింది. అలా సౌతాఫ్రికా పర్యటనను మన టీమ్ ఇండియా ఓపెనర్ల డకౌట్ల తో ప్రారంభమైంది. ఇలా జరగడం ఏడేళ్లలో మొదటిసారి అని అంటున్నారు.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు తొలి ఓవర్‌లోనే గట్టి దెబ్బ తగిలింది. మార్కో జాన్సెన్ వేసిన ఓవర్, మూడో బాల్ కి యశస్వీ జైస్వాల్ డక్ అవుట్ అయ్యాడు. తర్వాత రెండో ఓవర్ ప్రారంభమైంది. లిజాడ్ విలియమ్స్ బౌలింగ్ లో శుభ్‌మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో టీమిండియా 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
భారత ఓపెనర్లు ఇద్దరూ ఇలా సున్నాలు చుట్టడం, గత ఏడేళ్లలో ఇదే తొలిసారి అని అంటున్నారు. 2016లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అప్పటి టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు ఇలాగే డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియా విజయం సాధించింది.
ఈ గుండు సున్నాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. భారత ఓపెనర్లు ఇద్దరూ సఫారీ గడ్డపై గుడ్లు పెట్టారని కామెంట్ చేస్తున్నారు. యశస్వి జైపాల్ బదులు సూపర్ ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ను తీసుకుంటే సరిపోయేదని అంటున్నారు. ఎందుకంటే వారిద్దరిలో చూస్తే గైక్వాడ్ స్ట్రయిక్ రేట్ అద్భుతంగా ఉందని అంటున్నారు. కాకపోతే తన వెనుక ఏ రికమండేషన్ లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదండీ సంగతి…ఏదో జరుగుతుందనుకుంటే, ఇంకేదో అయ్యింది.