
SOUTH AFRICA : ఈ టీమ్ తొలి ప్రపంచ కప్ లో సంచలన ప్రదర్శన చేసింది. వరుస విజయాలతో సత్తాచాటింది. సెమీస్ లోకి దూసుకెళ్లింది. సెమీస్ లో విజయానికి చేరువలోకి వచ్చిన సమయంలో అనూహ్యంగా వర్షం రూపంలో దురదృష్టం వెంటాడింది.గెలుపునకు 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన ఉండగా దక్షిణాఫ్రికా లక్ష్యం.. డక్ వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం ఒక్కబంతికి 22 రన్స్ గా మారింది. ఇలా 1992 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై సెమీస్ లో ఓడి సౌతాఫ్రికా ఇంటిముఖం పట్టింది.
1996 వరల్డ్ కప్ లోనూ దక్షిణాఫ్రికా హాట్ ఫెవరేట్ గా బరిలోకి దిగింది. లీగ్ దశలో 5 మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. అయితే అనూహ్యంగా విండీస్ పై క్వార్టర్స్ లో సౌతాఫ్రికా ఓటమిపాలైంది. ఇక 1999 వరల్డ్ కప్ లోనూ సఫారీ జట్టు ఫేవరేట్ టీమే. సూపర్ -6 మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టివ్ వా ఇచ్చిన సులభమైన క్యాచ్ పట్టే క్రమంలో హెర్షల్ గిబ్స్ అత్యుత్సాహం కొంపముంచింది. ఈ క్యాచ్ నేలపాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో స్టివ్ వా అద్భుత సెంచరీతో ఆస్ట్రేలియా గెలిచింది. లేదంటే ఆసీస్ సెమీస్ ఆశలు ఆవిరయ్యేవి.
1999 మెగాటోర్నిలో సెమీస్ లో ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా జట్లే మళ్లీ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు విజయం ఇరుజట్లను ఊరించింది. లాన్స్ క్లుసెనర్ మెరుపులతో దక్షిణాఫ్రికా విజయం ముంగిట నిలిచింది. అయితే చివరి ఓవర్ లో అనూహ్యంగా డొనాల్డ్ రనౌట్ కావడంతో మ్యాచ్ టై గా ముగిసింది. అంతకుముందు ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన ఆసీస్ ఫైనల్ చేరుకుంది. స్వదేశంలో జరిగిన 2003 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా లీగ్ దశలో ఇంటిముఖం పట్టింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల టై కావడంతో సఫారీ జట్టుకు శాపంగా మారింది. దీంతో సూపర్ -6 స్టేజ్ కు చేరుకోలేదు.
2007 వరల్డ్ కప్ లో ఫేవరెట్స్ ఒకటిగా బరిలోకి దిగినా సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది సఫారీ టీమ్. 2011 వరల్డ్ కప్ లో లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు క్వార్టర్స్ లో కివీస్ చేతిలో అనూహ్యంగా ఓడింది. 2015 వరల్డ్ కప్ లోనూ సఫారీ జట్టును బ్యాడ్ లక్ వెంటాడింది. సెమీస్ లో ఉత్కంఠ పోరులో వర్షం మ్యాచ్ సమీకరణాలను మార్చేసింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాను కివీస్ ఓడించింది. 2019లో మెగాటోర్నిలో సఫారీ టీమ్ అంచనాల మేరకు రాణించలేదు. సౌతాఫ్రికా టీమ్ ఇప్పటి వరకు 8 ప్రపంచ కప్ టోర్నిల్లో పాల్గొంది. ఇంతవరకు ఆ జట్టు ఒక్కసారి కూడా ఫైనల్ కు చేరలేదు. నాలుగుసార్లు సెమీస్ లో ఓడిపోయింది.
వన్డే మ్యాచ్ ల్లో విజయాల పరంగా సఫారీ రికార్డు అద్భుతంగా ఉంది. కానీ వన్డే ప్రపంచ కప్ డ్రీమ్ మాత్రం ఇంకా నెరవేరలేదు. లీగ్ దశలో సింహగర్జన చేసే ఈ జట్టు.. నాకౌట్ లో తేలిపోవడం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని మ్యాచ్ ల్లో బ్యాడ్ లక్ వెంటాడింది. అయితే కీలక మ్యాచ్ ల్లో పూర్తి సామర్థ్యంతో ఆడలేకపోవడం ఆ జట్టు బలహీనత. మరి 13వ ప్రపంచ కప్ లోనైనా దక్షిణాఫ్రికా జట్టు తలరాత మారుతుందా? చూడాలి మరి.
Rajinikanth latest speech: అర్థమయ్యిందా రాజా!.. రజినీ పంచ్ డైలాగ్.. వైసీపీ ఉలిక్కిపాటు!!