BigTV English

T20 Series: నేటి నుంచి భారత్- శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌.. ముంబైలో తొలి మ్యాచ్..

T20 Series: నేటి నుంచి భారత్- శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌.. ముంబైలో తొలి మ్యాచ్..

T20 Series : వరుసగా రెండు టీ20 ప్రపంచకప్పుల్లో టీమిండియా దారుణంగా విఫలమైంది. 2021 వరల్డ్ కప్ లో కోహ్లి సారథ్యంలోని జట్టు గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఇక 2022 లో రోహిత్‌ నాయకత్వంలోని జట్టు సెమీస్ లో దారుణ పరాజయం చవిచూసింది. దీంతో జట్టు ప్రక్షాళన మొదలుపెట్టిన బీసీసీఐ టీ20లకు హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. జట్టులో కుర్రాళ్లకు చోటు కల్పించింది. ఆ యువజట్టు సొంతగడ్డపై శ్రీలంకతో తలపడతుంది. రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌ లాంటి సీనియర్లు ఈ సిరీస్‌లో ఆడట్లేదు.


శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ లో‌ తొలి మ్యాచ్‌ ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. టీ20 జట్టులో రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, సంజు శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠి, వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ లాంటి యువ ఆటగాళ్ల ఉన్నారు. వారు సత్తా చాటేందుకు మంచి అవకాశం దక్కింది.

ప్రయోగాలకు సిద్ధం..!
ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ సిరీస్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే రుతురాజ్ కు శుభమన్ గిల్ నుంచి పోటీ ఉంది. బంగ్లాదేశ్‌పై వన్డే మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ బాదిన ఊపులో ఉన్న ఇషాన్‌.. లంకపై ఎలా ఆడతాడో చూడాలి. రుతురాజ్‌ కు కూడా తనదైన ముద్ర వేయడానికి ఈ సిరీస్‌ మంచి అవకాశం. ఇన్నాళ్లూ నాలుగో స్థానంలో ఆడిన వైస్ కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ వస్తాడు. ఇటీవలే పొట్టి ఫార్మేట్ లో ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌గా నిలిచిన సూర్య.. తనదైన శైలిలో లంక బౌలింగ్‌పై దాడి చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. వికెట్‌ కీపర్‌ బాధ్యతలు సంజు శాంసన్‌ అప్పగించే అవకాశముంది. సరైన అవకాశాలు రావట్లేదని నిరాశ చెందుతున్న సంజు.. ఇప్పుడీ సిరీస్‌ను ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. హార్దిక్‌ పాండ్య బ్యాటుతో, బంతితో జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది.


అంచనాలు అందుకుంటారా?..
స్పీడ్ స్టార్ ఉమ్రాన్‌ మాలిక్‌పై అందరి దృష్టి ఉంది. ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ అద్భతంగా రాణిస్తున్న మరో యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ అదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. హర్షల్‌ పటేల్‌ కు మూడో పేసర్‌గా ఛాన్స్ దక్కవచ్చు. చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. దీపక్ హుడా వారికి సాయం అందించే ఛాన్స్ ఉంది.
రాహుల్‌ త్రిపాఠి, శివమ్‌ మావిలకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది.

బలపడిన లంక..
కొన్ని నెలల ముందు వరకు శ్రీలంక జట్టు బలహీనంగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో దసున్‌ శనక సారథ్యంలో మెరుగుపడింది. హసరంగ, శనక, ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నె ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు.. నిశాంక, కుశాల్‌ మెండిస్‌, అసలంకల బ్యాటింగ్‌ మెరుపులు.. బౌలింగ్ లో తీక్షణ, లహిరు కుమార నిలకడ ప్రదర్శనతో లంక ఆట మెరుగు పడింది. ఆసియా కప్‌లో భారత్‌ను ఓడించి లంక ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీ20 ప్రపంచకప్‌లోనూ ఆ జట్టు బాగానే ఆడింది.

పరుగుల వరదే..
భారత్‌-శ్రీలంక తొలి టీ20లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్ జరిగే ముంబై వాంఖడే మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ బౌండరీ లైన్ చాలా చిన్నగా ఉంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువ. స్పిన్నర్లకు పిచ్‌ నుంచి సహకారం లభిస్తుంది. ఈ మైదానంలో ఛేజింగ్ ‌ చేసిన జట్లే ఎక్కువగా గెలిచాయి. అందుకే టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

టీమిండియాదే పైచేయి..
భారత్‌-శ్రీలంక మధ్య 26 టీ20 మ్యాచ్ లు జరిగాయి. వాటిలో 17 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయభేరి మోగించింది. శ్రీలంక 8 మ్యాచ్ ల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. 2021 నుంచి ఇరు జట్లు 7 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్‌ 4, లంక 3 మ్యాచ్ లు గెలిచాయి. టీ20ల్లో చాహల్‌ ఇప్పటి వరకు 87 వికెట్లు తీశాడు. ఇంకో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకుంటే..అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్ గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు టీ20ల్లో భారత్ తరపున భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా 90 వికెట్లు తీశాడు.

తుది జట్లు అంచనా..
భారత్‌: ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, చాహల్‌.

శ్రీలంక: నిశాంక, కుశాల్‌ మెండిస్‌ (వికెట్‌ కీపర్‌), ధనంజయ డిసిల్వా, అసలంక, భానుక రాజపక్స, శనక (కెప్టెన్‌), హసరంగ, చమిక కరుణరత్నె, తీక్షణ, మదుశంక, లహిరు కుమార.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×