Big Stories

T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్.. సత్తా చాటింది.. ఐదుగురు మాత్రమే..

Indian Squad Performance in IPL: ఏమిటి? ఆశ్చర్యపోతున్నారా? అవునండీ బాబూ అవును.. టీ 20 ప్రపంచకప్ ఆడేందుకు టీమ్ ఇండియా జట్టు నుంచి 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తే, అందులో ఐదుగురు మాత్రమే ఓకే అనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో సహా అందరూ బొమ్మ చూపిస్తున్నారు. టీ 20 ప్రపంచకప్ నకు ఎంపికైన తర్వాత ఎంత హుషారుగా ఆడాలి? ఎంత శక్తితో ఆడాలి? ఎంత ఉత్సాహంతో ఆడాలి? మరేమైందో తెలీదు, ప్రపంచకప్ జట్టులోకి వెళ్లడంతోటే అందరూ ఇంకేం పర్వాలేదని అనుకున్నారో ఏటో తెలీదు. మొత్తానికి చాప చుట్టేస్తున్నారు.

- Advertisement -

సరే, ఇప్పుడు బాగా ఆడుతున్న ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. ప్రపంచకప్ ప్రకటించిన తర్వాత అంటే ఏప్రిల్ 30 నుంచి ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 161 పరుగులు చేసి నేనున్నాను అంటూ తెలిపాడు. టీ-20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ 4 మ్యాచ్‌లలో 169 పరుగులు చేసి తను కూడా ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో బుమ్రాకు సాటి ఎవరూ లేరని నిరూపించుకున్నాడు. 4 ఇన్నింగ్స్‌లలో 5 వికెట్లు తీసి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. పరుగులు కూడా పొదుపుగా చేస్తున్నాడు. అక్షర్ పటేల్ అయితే ఆల్ రౌండర్ గా ఆకట్టుకున్నాడు. ఎటాకింగ్ లో మంచి స్కోర్లు చేశాడు. మహ్మద్ సిరాజ్ కూడా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 4 మ్యాచ్‌లలో 6 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ బాగా చేశాడు.

- Advertisement -

ఆడలేకపోతున్న టీమ్ ఇండియా ప్లేయర్లపై ఒక్కమాటలో చెప్పాలంటే..

ప్రపంచ జట్టు ప్రకటించిన దగ్గర నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ 4 మ్యాచ్‌లు ఆడి మొత్తం 38 పరుగులు చేశాడు. అతని ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్ ఇబ్బందులు పడుతున్నాడు. ప్రపంచ కప్ జట్టు ఎంపిక తర్వాత యశస్వి 3 మ్యాచ్‌ల్లో 95 పరుగులు మాత్రమే చేశాడు. ఫాస్ట్ బౌలింగుని సులువుగా ఎదుర్కొనే యశస్వి మొదట్లోనే అవుట్ అయిపోతున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగులో పర్వాలేకపోయినా బ్యాటింగులో చూస్తే 3 పరుగులు మాత్రమే చేశాడు. శివమ్ దూబె ఎంపిక ముందు అదరగొట్టి, ఎంపికైన తర్వాత సల్లబడిపోయాడు. 4 మ్యాచ్ లు ఆడి రెండింట్లో డక్ అవుట్ అయ్యాడు.

రవీంద్ర జడేజాను చూస్తే.. 3 వికెట్లు తీసి, 67 పరుగులు చేశాడు. రాజస్థాన్ మ్యాచ్ లో క్రీజుకి అడ్డంగా వెళ్లి రన్ అవుట్ ను ఆపి, కోరి వివాదాల్లో చిక్కుకున్నాడు. సంజూశాంసన్ 3 మ్యాచ్ ల్లో 101 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ అయితే ఒక మ్యాచ్ మాత్రమే ఆడి 15 పరుగులు చేశాడు. స్పిన్ జోడి కులదీప్, చాహల్ ఇద్దరి ఫామ్ అంతంతమాత్రంగానే ఉంది. కులదీప్ 2 మ్యాచ్ ల్లో 3 వికెట్లు తీస్తే, చాహల్ మూడు మ్యాచ్ ల్లో 2 వికెట్లు తీశాడు. అర్షదీప్ అయితే మూడు మ్యాచ్ ల్లో 4 వికెట్లు తీశాడు.

Also Read: టీ 20 ప్రపంచకప్ టీమ్ ప్రదర్శనతో బెంబేలు.. ఇలా ఆడితే వరల్డ్ కప్పు కాదు కదా.. టీ కప్పు కూడా కష్టమే!

15మందిలో 10 మంది ఆట, స్వదేశీ పిచ్ ల పైనే ఇంత ఆందోళనకరంగా ఉంటే, రేపు విదేశీ పిచ్ లపై ఎలా ఆడగలరనే విమర్శలు ఇప్పుడే వినిపిస్తున్నాయి. మరేమైనా జట్టు కూర్పుని మార్చుతారా? లేదా?, ఇదే జట్టుని పంపిస్తారా? అనేది బీసీసీఐ సెలక్షన్ కమిటీ, టీమ్ ఇండియా కెప్టెన్, హెడ్ కోచ్ చేతుల్లోనే ఉంది. మరేం జరగబోతోందనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News