
ICC Champions Trophy : ఆశ్చర్యపోతున్నారా? నిజమండీ నిజం..టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలిచి.. ఇప్పటికీ పదేళ్లయ్యింది. ఈ మాట అక్షరాలా నిజం. ధనాధన్ మహేంద్రసింగ్ ధోనీతోనే ఐసీసీ ట్రోఫీలు కూడా వెళ్లిపోయాయా? అంటే అవునండీ అవును అని అంటున్నారు.
2013లో చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ టోర్నీ తర్వాతి నుంచి టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు.
2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమిపాలైంది.
పైన చెప్పిన లెక్క ప్రకారం టీమ్ ఇండియా దాదాపు అన్ని టోర్నమెంట్లలో నాకౌట్ దశకు చేరుకుందనే చెప్పాలి. అంత కష్టపడి లీగ్ దశలను దాటుకుని సెమీస్ లేదా ఫైనల్స్ ముంగిట వరకు వెళ్లి అక్కడ బొక్కబోర్లా పడింది.
నిజానికి ధోనీ సారథ్యంలోనే వన్డే వరల్డ్ కప్, టీ 20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇవన్నీ ఇండియా పట్టుకొచ్చింది. టెస్టుల్లో కూడా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. తను రిటైర్ అయ్యాక మళ్లీ ఆ వైభవాన్ని చూడలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒకప్పుడు ఇండియా ఒత్తిడిని జయించలేక చివర్లో ఓటమి పాలయ్యేది. అంతవరకు అరివీర భయంకరంగా ఆడి, సరిగ్గా గెలవడానికి 10 పరుగుల దూరంలో కూడా అవుట్ అయిపోయేవారు. ఫైనల్ ఫోబియా మనోళ్లని చాలాకాలం వెంటాడింది.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆడే కాలంలో ఈ బలహీనత భారతజట్టుకి ఉండేది. నెమ్మదినెమ్మదిగా సౌరభ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలు వచ్చాక..లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి మ్యాచ్ లను గెలిచే స్థితికి ఇండియా వచ్చింది.
కానీ ఇప్పుడు పైన చెప్పిన లిస్ట్ చూస్తుంటే, నాకౌట్ ముంగిట గెలవలేకపోవడం అభిమానులందరికీ టెన్షన్ పెడుతోంది. మరి రేపటి మ్యాచ్ ని ఎలా ముగిస్తారో చూడాల్సిందే.