
World Cup 2023 Final Match : వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ కి హై ఓల్డేజ్ వచ్చేసింది. ఇండియా-ఆస్ట్రేలియా ఎక్కడ చూసినా ఇదే మాట. కివీస్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ని ఒక్క హాట్ స్టార్ లోనే ఆరోజు 5 కోట్ల మంది చూశారని అంచనా. ఇక మిగిలిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలపై, టీవీల్లో, గ్యాలరీలో ఎంత మంది చూసి ఉంటారో లెక్కే లేదు.
ఈ పరిస్థితుల్లో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అందరూ అహ్మదాబాద్ పరుగులెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ధరలు చుక్కలనంటుతున్నాయి. ముఖ్యంగా విమాన ఛార్జీలు దగ్గర నుంచి లాడ్జీ రూమ్ ల వరకు ధరలు దీపావళి టపాసులకన్నా భారీ గా పేలుతున్నాయి.
సాధారణ రోజుల్లో హోటల్ గదికి ఒక రాత్రి అద్దె రూ.5 వేలు ఉండగా ఇప్పుడు రూ.50 వేలకు పెరిగింది. అంతే కాదు కొన్ని హోటళ్ల ధర రూ.లక్ష వరకు పెరిగినట్లు సమాచారం. ఇప్పటికే చాలా హోటళ్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. కొన్ని లగ్జరీ హోటళ్లు అయితే.. నవంబర్ 18 నుంచి బుకింగ్ లను ఆపేశాయని చెబుతున్నారు. లగ్జరీ హోటళ్లలో అయితే రూమ్ ఛార్జీ రూ.25వేల నుంచి ఏకంగా రూ.2,15,000కు చేరాయని అంటున్నారు.
సొంతకార్లపై అప్పుడే అహ్మదాబాద్ కి చాలామంది బయలుదేరిపోయారు. కొందరు విహార యాత్రగా కూడా మార్చేసుకుని స్నేహితులతో కలిసి వెళుతున్నారు. పుణ్యం పురుషార్థం కలిసి వస్తాయని అంటున్నారు. ఇక ప్రైవేటు బస్సులు కూడా రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేశాయని మరికొందరు ఆక్రోశిస్తున్నారు.
మరోవైపు విమానం టిక్కెట్టు ధరలు 300 శాతం పెరిగాయని చెబుతున్నారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు విమాన ఛార్జీ రూ.3500 ఉంటే, ఇప్పుడు రూ.23, 000 అయ్యింది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కు రూ.3,500 ఉంటే, ప్రస్తుతం రూ.28,000 పైనే నడుస్తోంది. కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు రూ.7,000 ఉంటే, అది రూ.36,000కి పెరిగింది. అలాగే చెన్నై నుండి అహ్మదాబాద్ కు రూ. 5000 నుండి 24000 రూ. పెరిగినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ కోసం స్టేడియంలో టికెట్ల తుది దశ విక్రయాలు చేపడితే క్షణాల్లోనే అమ్ముడుపోవడం విశేషం. ఇలాగైతే సామాన్య, మధ్య తరగతి ప్రజల గతేమిటి? అని వారు గగ్గోలు పెడుతున్నారు. మరికొందరు ఎందుకు బ్రదర్…బాధపడతారు..హాయిగా టీవీ ముందు కూర్చుని వేడివేడి పకోడీలు తింటూ మ్యాచ్ ని ఎంజాయ్ చేయండి అని సలహాలిస్తున్నారు.